Share News

పాకిస్థాన్ సహజ వనరులను ఆ దేశ సైన్యం దోచుకుంటోంది.. భారత్ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:55 PM

ఈరోజు (గురువారం) ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. ఆ దేశంలోని సహజ వనరులను అక్కడి సైన్యం దోచుకుంటోందని భారత రాయబారి పార్వతనేని హరీశ్ ఆరోపించారు.

పాకిస్థాన్ సహజ వనరులను ఆ దేశ సైన్యం దోచుకుంటోంది.. భారత్ సంచలన ఆరోపణలు

ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు (గురువారం) ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. ఆ దేశంలోని సహజ వనరులను అక్కడి సైన్యం దోచుకుంటోందని భారత రాయబారి పార్వతనేని హరీశ్ ఆరోపించారు. సహజ వనరులపై నిర్వహించిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలో పాల్గొన్న పాకిస్థాన్ ప్రతినిధులు.. మొదట సింధూ జలాల ఒప్పందం నిలిపివేత గురించి ప్రస్తావించారు. దీనిపై హరీశ్ ఘాటుగా స్పందించారు. రెండు దేశాలకు పరిమితమైన వివాదాలను ఈ వేదికపై చర్చించే ఆలోచన భారత్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే పాక్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చి తీరుతామని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందానికి సంబంధించి తమ వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చి చెప్పారు.


సహజ వనరులను దోచుకుంటున్న పాక్..

ఈ సమావేశంలో హరీశ్ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ ఆ దేశ ఖనిజ సంపదను నియంత్రిస్తున్నారని ఆరోపించారు. గతంలో మునీర్ ఓ దేశాధ్యక్షుడికి ఖనిజ రాళ్లతో నిండి ఉన్న పెట్టెను ఇచ్చారని.. ఇది ఆ దేశ సైన్యం సహజ వనరులను దోచుకుంటోందనే దానికి ఆధారమని భారత రాయబారి పేర్కొన్నారు. అలాగే ఈ సంపదనంతా పాక్.. కేవలం సైనిక ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆయన చెప్పారు. కాగా నిరుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మునీర్ ఖనిజ రాళ్లతో ఉన్న బ్యాక్స్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్నే హరీశ్ పరోక్షంగా ప్రస్తావించారు.

పాకిస్థాన్‌ను పరిపాలిస్తున్న అక్కడి సైన్యం ఆ దేశ ప్రజల కోసం సహజ వనరులను వినియోగిస్తే మంచిదని హరీశ్ అభిప్రాయపడ్డారు. అలాగే పొరుగు దేశాలను రెచ్చగొట్టడం పాక్ మానేస్తే ఇంకా మేలు జరుగుతుందని చెప్పారు. అనంతరం ప్రపంచ వనరులను ఎలా సంరక్షించాలో హరీశ్ వివరించారు.


ఈ వార్తలూ చదవండి

పంజాబ్‌లో కుప్పకూలిన ఇనుప వంతెన.. శిథిలాల్లో చిక్కుకున్న భారీ ట్రక్కులు

బంగ్లాదేశ్‌లో మళ్లీ భగ్గుమన్న హింస.. మహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పు!

Updated Date - Nov 19 , 2026 | 01:58 PM