20 బిలియన్ యూరోల టార్గెట్.. ఇటలీతో మోదీ 'స్పెషల్' డీల్!
ABN , Publish Date - May 20 , 2026 | 07:48 PM
భారత్, ఇటలీ దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్’ స్థాయికి పెంచుతున్నట్లు ఇరుదేశాల ప్రధానులు ప్రకటించారు.
రోమ్/ న్యూఢిల్లీ, మే 20: భారత్, ఇటలీ దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్’ (ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం) స్థాయికి పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇటలీ రాజధాని రోమ్‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల అధినేతలు ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. భారత్-ఇటలీ సంబంధాలు ఇప్పుడు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకునే స్థాయికి చేరుకున్నాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ (2025-2029)
ఇరు దేశాల భాగస్వామ్యానికి మరింత ఊతమిచ్చేందుకు, భవిష్యత్ కార్యాచరణకు దిక్సూచిగా నిలిచే ‘భారత్-ఇటలీ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029’ను ప్రధాని మోదీ ప్రకటించారు. ఒక నిర్దేశిత కాలపరిమితిలో ఈ ప్రణాళికను అమలు చేస్తూ ఇరు దేశాలు ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం వేగంగా పుంజుకుంటోంది. ఇప్పటికే భారతదేశంలో 400 కి పైగా ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి, మన దేశ వృద్ధిలో భాగస్వాములవుతున్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు.
చరిత్రలోనే అత్యున్నత స్థాయికి సంబంధాలు: మెలోని
భారత్, ఇటలీల మధ్య ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్’ ప్రకటనను ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వాగతించారు. ఇరు దేశాల చరిత్రలోనే ఇదొక అత్యున్నత స్థాయి దౌత్య సంబంధమని ఆమె అభివర్ణించారు. గత మూడేళ్ల కాలంలో ప్రధాని మోదీతో తాను జరిపిన ఏడు సమావేశాలు ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, నమ్మకంతో కూడిన బలమైన స్నేహ బంధాన్ని ఏర్పరిచాయని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని, ఆయనకున్న ప్రజాదరణను మెలోని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.
20 బిలియన్ యూరోల భారీ వాణిజ్య లక్ష్యం!
ప్రస్తుతం భారత్-ఇటలీల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 14 బిలియన్ యూరోలుగా ఉంది. దీనిని 2029 నాటికి 20 బిలియన్ యూరోలకు (దాదాపు రూ. 1.80 లక్షల కోట్లు) పెంచాలని ఇరు దేశాల అధినేతలు ఒక భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఐరోపా సమాఖ్య (EU) - భారత్ మధ్య కుదిరిన ఉచిత వాణిజ్య ఒప్పందం (FTA) ద్వారా ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సులభంగా అందుకోగలమని ప్రధాని మెలోని ధీమా వ్యక్తం చేశారు.

'ఇన్నోవేట్ ఇండియా'కు ఊతం.. ఢిల్లీలో ప్రత్యేక కేంద్రం!
టెక్నాలజీ, పరిశోధనల రంగంలో సరికొత్త ఆవిష్కరణల కోసం ఇరు దేశాల ప్రతిభను ఏకం చేస్తూ ‘ఇన్నోవేట్ ఇండియా ఇనిషియేటివ్’ (Innovate India Initiative) ను ప్రోత్సహించనున్నట్లు ఇటలీ ప్రధాని ప్రకటించారు. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ఇరు దేశాల స్టార్టప్‌లు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల మధ్య వారధిగా పనిచేస్తూ సాంకేతిక విప్లవానికి బాటలు వేయనుంది.

ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీపై జాత్యహంకార కార్టూన్.. నార్వే పత్రికపై జనాగ్రహం
ఇరాన్ యుద్ధంతో ఆగ్రహం.. ట్రంప్‌నకు హ్యాండిచ్చిన సొంత పార్టీ సెనేటర్లు