Share News

ప్రధాని మోదీపై జాత్యహంకార కార్టూన్.. నార్వే పత్రికపై జనాగ్రహం

ABN , Publish Date - May 20 , 2026 | 09:47 AM

ప్రధాని మోదీపై జాత్యహంకార పూరిత కార్టూన్‌తో ఒక వ్యాసాన్ని ప్రచురించిన నార్వే పత్రికపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధాని మోదీపై జాత్యహంకార కార్టూన్.. నార్వే పత్రికపై జనాగ్రహం
Aftenposten newspaper Racist Cartoon

ఇంటర్నెట్ డెస్క్: నార్వేకు చెందిన ఒక పత్రిక ఇటీవల తన వలసవాద భావజాలాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించింది. ప్రదాని మోదీపై జాత్యహంకార పూరిత కార్టూన్‌ను ప్రచురించి తన దుర్బుద్ధిని బయటపెట్టుకుంది. పాతకాలం నాటి భావజాలాన్ని తాము వదులుకోలేమని రుజువు చేసుకున్న Aftenposten పత్రికపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీపై వ్యాసంతో పాటు ఈ కార్టూన్‌ను ప్రచురించింది. ఒక తెలివైన, విసిగించే వ్యక్తి అన్న శీర్షికను జోడించింది.


ఈ కార్టూన్‌పై నెట్టింట జనాగ్రహం పెల్లుబుకుతోంది. పత్రిక తీరును అనేక మంది దుయ్యబట్టారు. పాతకాలం నాటి వలసవాద భావజాలం నిండిన వ్యాసాన్ని ప్రచురించారని ఆరోపించారు. విదేశీ ద్వేషం నింపుకున్న ఈ కార్టూన్ అవమానకరమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐరోపాలో ఒక ప్రధాన పత్రిక ఇలాంటి వ్యాసాన్ని ప్రచురించడం దారుణమని వ్యాఖ్యానించారు. వలసవాద భావజాలం నుంచి ఇప్పటికీ ఐరోపా వారు బయటపడలేకపోతున్నారని కొందరు విదేశీయులు కూడా విమర్శించారు.


‘ఇది జర్నలిజం కాదు. విశ్లేషణ ముసుగు తొడుక్కున్న జాత్యహంకారం, భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేక వారు తమ తాతల నాటి ధోరణులను మళ్లీ ప్రదర్శిస్తున్నారు. వారు వేసుకున్న మాస్కు ప్రతిసారీ ఇలా తొలగిపోయి అసలు రంగు బయటపడుతోంది’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. ప్రధాని మోదీ విషయంలో ఒక నార్వే మహిళా జర్నలిస్టు వ్యవహరించిన తీరుపై ఇప్పటికే వివాదం రగులుతున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్‌ యుద్ధంతో ఆగ్రహం.. ట్రంప్‌నకు హ్యాండిచ్చిన సొంత పార్టీ సెనేటర్లు

నార్వే మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు

Updated Date - May 20 , 2026 | 12:01 PM