ప్రధాని మోదీపై పాక్ మంత్రి విద్వేషపూరిత వ్యాఖ్యలు.. భారత్ ఘాటు కౌంటర్..
ABN , Publish Date - Jul 05 , 2026 | 06:37 PM
ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్ ద్వీపదేశం ఇచ్చిన పురస్కారంపై అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌కు భారత్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఆయనకు మతిస్థిమితం లేదని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్ ద్వీపదేశం ఇచ్చిన పురస్కారంపై అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif)కు భారత్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఆయనకు మతిస్థిమితం లేదని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని పేర్కొంది. ఇటీవల సీషెల్స్‌లో పర్యటించిన ప్రధాని మోదీని ఆ దేశం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్' పురస్కారంతో సత్కరించింది.
ఈ సత్కారంపై పాక్ రక్షణ మంత్రి సోషల్ మీడియా వేదికగా అక్కసు వెళ్లగక్కారు. అది కావాలని ఇప్పించుకున్న అవార్డు అని ఆరోపించారు. ఈ అవార్డును మోదీ పర్యటన కోసమే ప్రత్యేకంగా రూపొందించారని, ప్రశంసాపత్రం కృత్రిమ మేధ (AI) సాయంతో తయారు చేసినట్లు కనిపిస్తోందని ఖవాజా ఆసిఫ్ సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించారు. ఆసిఫ్ వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది (Seychelles Award).
'ఖవాజా ఆసిఫ్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తికి రక్షణ శాఖ వంటి కీలక బాధ్యతలు అప్పగించడం నేటి పాకిస్థాన్ పరిస్థితికి అద్దం పడుతోంది. ఆయనకు అసలు విషయాలపై అవగాహన లేదు. తెలిసీ తెలియక వ్యాఖ్యలు చేస్తున్నారు. ద్వేషం, అసూయతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని హితవు పలికింది (Pakistan Defence Minister).
కాగా, పాక్ మంత్రి ఆరోపణలపై ఇప్పటికే సీషెల్స్ ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రశంసాపత్రం కేవలం ప్రాథమిక ముసాయిదా మాత్రమేనని, అధికారికంగా అందజేసిన తుది పత్రంలో ఎలాంటి తప్పులూ లేవని స్పష్టం చేసింది. అలాగే ఈ గౌరవాన్ని మోదీ పర్యటనకు ముందే మంత్రివర్గం ఆమోదించిందని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్‌లో సేవా రుసుం.. మిత్ర దేశాలకు ప్రత్యేక రాయితీలు: ఇరాన్
సోషల్ మీడియా వల్ల విభేదాలు.. భార్యను చంపేసిన భర్త..