Share News

భారత్‌ వద్ద ఉన్నది 32 రఫేల్‌ ఫైటర్సే!

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:26 AM

గత ఏడాది పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో కీలకపాత్ర పోషించిన అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాల్లో ప్రస్తుతం నాలుగు తగ్గాయని బ్రిటన్‌కు చెందిన ఏవియేషన్‌ మ్యాగజీన్‌ ఫ్లైట్‌ గ్లోబల్‌ తన తాజా నివేదిక ‘వరల్డ్‌ ఎయిర్‌ఫోర్స్‌ డైరెక్టరీ’లో వెల్లడించింది

భారత్‌ వద్ద ఉన్నది 32 రఫేల్‌ ఫైటర్సే!
rafele

న్యూఢిల్లీ, నవంబరు 20: గత ఏడాది పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో కీలకపాత్ర పోషించిన అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాల్లో ప్రస్తుతం నాలుగు తగ్గాయని బ్రిటన్‌కు చెందిన ఏవియేషన్‌ మ్యాగజీన్‌ ఫ్లైట్‌ గ్లోబల్‌ తన తాజా నివేదిక ‘వరల్డ్‌ ఎయిర్‌ఫోర్స్‌ డైరెక్టరీ’లో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా విధి నిర్వహణలో ఉన్న యుద్ధ విమానాల సంఖ్యను ఈ సంస్థ ఏటా ప్రకటిస్తూ ఉంటుంది. 2026 సంవత్సరానికి సంబంధించిన నివేదికలో భారత్‌ వద్ద ప్రస్తుతం 32 రఫేల్‌ యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. నిజానికి ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ 36 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. వీటిలో 28 సింగిల్‌ సీటర్‌, 8 ట్విన్‌ సీటర్‌ విమానాలు ఉన్నాయి. గత ఏడాది మే నెలలో ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో సైనిక చర్య నిర్వహించిన తర్వాత ఫ్లైట్‌ గ్లోబల్‌ విడుదల చేసిన 2025 సంవత్సరపు నివేదికలో భారత్‌వద్ద 35 రఫేల్‌ యుద్ధ విమానాలు ఉన్నాయని తెలిపింది. తాజాగా ఆ సంఖ్యను 32కు తగ్గించింది. మరోవైపు పాకిస్థాన్‌ వద్ద ఉన్న సాబ్‌ 2000 ఎరియే గగనతల ముందస్తు హెచ్చరిక, నియంత్రణ విమానాలు 9 నుంచి 7కు తగ్గాయని పేర్కొంది. ఫ్లైట్‌ గ్లోబల్‌ నివేదికపై భారత రక్షణ శాఖతోపాటు వైమానిక దళం (ఐఏఎఫ్‌) మాజీ అధికారులు మండిపడ్డారు. ఆ నివేదికలోని గణాంకాలు ఐఏఎఫ్‌ ఇచ్చినవి కావని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. అయితే, ప్రస్తుతం ఐఏఎఫ్‌ వద్ద ఎన్ని రఫేల్‌ యుద్ధ విమానాలు ఉన్నాయన్నది మాత్రం వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి..

ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 03:40 AM