Share News

పరుగులు తీసింది హైడ్రోజన్‌ రైలు!

ABN , Publish Date - Jul 18 , 2026 | 06:25 AM

దేశ రైల్వే చరిత్రలో సరికొత అధ్యాయం మొదలైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్‌ రైలును.. శుక్రవారం ఇక్కడ హరియాణాలోని జింద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ..

పరుగులు తీసింది హైడ్రోజన్‌ రైలు!

  • పట్టాలపై దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్‌ రైలు

  • జెండా ఊపి ప్రారంభించిన మోదీ

  • హరియాణాలోని జింద్‌-సోనీపత్‌ మధ్య తిరగనున్న రైలు

  • 10 కోచ్‌లు.. పొడవైన రైలు మనదే

  • రైలు అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్‌ సంస్థ

ఙంద్‌, జూలై 17: దేశ రైల్వే చరిత్రలో సరికొత అధ్యాయం మొదలైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్‌ రైలును.. శుక్రవారం ఇక్కడ హరియాణాలోని జింద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. గడిచిన పన్నెండేళ్లలో భారతీయరైల్వే గణనీయంగా అభివృద్ధి చెందిందని ఈ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. తాము చేపట్టిన ‘భారత్‌లోనే తయారీ (మేకిన్‌ ఇండియా)’ కార్యక్రమం విజయవంతమైందనడానికి ఈ రైలే ఒక నిదర్శనం అని.. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌ ట్రైన్‌ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, యుద్ధం గురించి కూడా ప్రస్తావించారు. హోర్ముజ్‌ జలసంధి గుండా భారత్‌కు పెద్ద ఎత్తున ముడిచమురు, గ్యాస్‌, ఎరువులు సరఫరా అవుతాయని.. కానీ 3-4 నెలలుగా ఆ మార్గం యుద్ధక్షేత్రంగా మారిందని.. దానివల్ల చమురు సంక్షోభం ఏర్పడినప్పటికీ భారత రైల్వేగానీ, దేశ అభివృద్ధి వాహనంగానీ ఆగలేదని వ్యాఖ్యానించారు. ‘‘2014కు ముందు ఇవే పరిస్థితులు ఏర్పడి ఉంటే భారతీయ రైల్వే కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి పోయేవి. ఎందుకంటే అప్పట్లో దేశంలోని రైళ్లలో అత్యధికం డీజిల్‌తోనే నడిచేవి. అలాంటి డీజి ల్‌ సరఫరా నిలిచిపోతే.. ఆ రైళ్లు ఎలా నడుస్తాయి? దీనివల్ల దేశం చాలా పెద్ద సంక్షోభంలో చిక్కుకునేది. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడున్నది మోదీ. చాలా ముందుగానే ఆలోచించి సమస్యలకు పరిష్కారమార్గాలను ముందే గుర్తిస్తాడు’’ అన్నారు. హైడ్రోజన్‌ రైలును ప్రారంభించిన అనంతరం ఆయన రూ.14,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇక.. దేశీయంగానే ఈ రైలును అభివృద్ధి చేయాలని దేశ నాయకత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే ఇంతటి భారీ సాంకేతిక మైలురాయిని అందుకోవడం సాధ్యమైందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. ప్రస్తుతానికి జింద్‌ నుంచి సోనిపత్‌కు 89 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మధ్యలో 12స్టేషన్లలో ఆగుతుంది. సోనీపత్‌ ఢిల్లీ సెక్షన్ల మధ్య (44కిలోమీటర్లు) ఈ రైలు ప్రయాణానికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయని.. అవి పూర్తయితే జింద్‌ నుంచి ఢిల్లీ దాకా ఈ రైలు నడుస్తుందని ఆ యన వివరించారు. శనివారం నుంచి ఈ రైలు సేవ లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.


ఇవీ రైలు ప్రత్యేకతలు..

ఈ రైలు.. సాధారణ రైళ్లలా కాకుండా.. మెట్రో రైలులా 10 బోగీలతో ఒకే సెట్‌ (టెన్‌ కార్‌ హైడ్రోజన్‌ ఫ్యూయెల్‌ ట్రెయిన్‌ సెట్‌)గా ఉంటుంది. వీటిలో రెండు (రైలుకు ఇరువైపులా ఉండే) డ్రైవింగ్‌ పవర్‌ కార్లు కాగా.. మిగతా ఎనిమిదీ ప్యాసింజర్‌ కోచ్‌లు. రెండు డ్రైవింగ్‌ పవర్‌కార్లూ కలిసి ఏకంగా 3200హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తాయి.

  • జర్మనీ, జపాన్‌, ఫ్రాన్స్‌, చైనా వంటి దేశాల్లో ఉన్న హైడ్రోజన్‌ రైళ్లలో 2 నుంచి 4 కోచ్‌లు మాత్రమే ఉంటాయి. ఆ రకంగా చూస్తే.. మోదీ ప్రారంభించింది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్‌ పవర్డ్‌ ప్యాసింజర్‌ రైలు. దీంట్లో ఒకేసారి ఏకంగా 2600 మంది ప్రయాణించే వీలుంది.

హైదరాబాద్‌ సంస్థ కీలకపాత్ర

మేకిన్‌ ఇండియాలో భాగంగా ఈ హైడ్రోజన్‌ రైలును పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. రైలు కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎ్‌ఫ)లో తయారుచేశారు. తయారైన రైళ్లు మన ట్రాక్‌లపై సురక్షితంగా నడవగలవా? లేదా? అనే పరీక్షలు చేసింది.. ఇండియన్‌ రైల్వే పరిశోధనల విభాగమైన ఆర్‌డీఎ్‌సవో (రిసెర్చ్‌ డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌). ఇక.. ఈ రైలు నిర్మాణంలో అత్యంత కీలకమైన ‘హైడ్రోజన్‌-టు-ఎలక్ట్రిక్‌’ కన్వర్షన్‌ సాంకేతికతను అందించింది మన హైదరాబాద్‌కు చెందిన ‘మేధా సర్వో డ్రైవ్స్‌’ సంస్థ కావడం విశేషం. హైడ్రోజన్‌ను వాడుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసి, రైలు చక్రాలను తిప్పే మోటార్లకు అందించే పూర్తి వ్యవస్థను ఈ సంస్థే అనుసంధానించింది.

ఇవి కూడా చదవండి

మూగజీవాలకు అపన్నహస్తం..

తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు

Updated Date - Jul 18 , 2026 | 06:25 AM