Share News

114 కాదు.. 214 రఫేల్స్‌!

ABN , Publish Date - Jul 07 , 2026 | 06:26 AM

భారతదేశం ఫ్రాన్స్‌ నుంచి 114 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఇటీవలే ‘లెటర్‌ ఆఫ్‌ రిక్వెస్ట్‌’ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్‌ ఆ విమానాలతో సరిపెట్టుకోవట్లేదని....

114 కాదు.. 214 రఫేల్స్‌!

న్యూఢిల్లీ, జూలై 6: భారతదేశం ఫ్రాన్స్‌ నుంచి 114 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఇటీవలే ‘లెటర్‌ ఆఫ్‌ రిక్వెస్ట్‌’ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్‌ ఆ విమానాలతో సరిపెట్టుకోవట్లేదని.. ఆర్డర్‌ను 214 విమానాలకు పెంచాలనుకుంటోందని సాక్షాత్తూ రఫేల్‌ యుద్ధవిమానాల తయారీ సంస్థ దసో సీఈవో ఎరిక్‌ ట్రాపియెర్‌ ‘ఫ్రెంచ్‌ పార్లమెంటరీ డిఫెన్స్‌ కమిటీ’కి తెలిపారు. భారతదేశం ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం ద్వారా తన రఫేల్‌ యుద్ధవిమానాల సామర్థ్యాన్ని కొనసాగించడమే కాక మరింతగా విస్తరించాలని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 214 విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరిందని వెల్లడించారు. అంతేకాదు.. ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా వాటిలో కొన్ని విమానాల తుది అసెంబ్లింగ్‌ భారత్‌లో చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది ముగిసేలోగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని తాము భావిస్తున్నట్టు తెలిపారు. అయితే.. రఫేల్‌ యుద్ధవిమానాల సరఫరా కాలక్రమంపై భారత రక్షణ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. దసో వద్ద ఇప్పటికే 220 విమానాలకు సంబంధించిన ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ముందు వాటన్నింటినీ పూర్తిచేయాలి. భారత్‌తో ఒప్పందం ఈ ఏడాది చివరినాటికి ఖరారైనా, తొలి రఫేల్‌ ఎఫ్‌4 (4.5 జనరేషన్‌ యుద్ధవిమానం) మనకు అందేసరికి 2030 అవుతుంది. ఇక 114 విమానాలూ అందడానికి 2040 దాకా పడుతుందని అంచనా. 214 విమానాలంటే.. మరింత ఆలస్యమవుతుంది. మరోవైపు.. చైనా ఏమో ఇప్పటికే ఆరో తరం యుద్ధవిమానాలను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇటు పాకిస్థాన్‌ చూస్తే చైనా నుంచి ఐదో తరం యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ 4.5 జనరేషన్‌ యుద్ధవిమానాలైన రఫేల్స్‌ను కొనుగోలు చేస్తే.. అవి అత్యంత అధునాతనమైన చైనా, పాకిస్థాన్‌ యుద్ధవిమానాలతో ఎంతవరకూ పోటీపడతాయన్నది రక్షణ రంగ నిపుణుల ఆందోళన. 2040 తర్వాత టీరెక్స్‌ ఇంజన్‌తో కూడిన రఫేల్‌ ఎఫ్‌5 విమానాల వైపు మొగ్గుచూపినప్పటికీ.. ఆ అప్‌గ్రేడ్స్‌ను భారత్‌ ఎంత త్వరగా అందుకుంటుంది? అవి మన రఫేల్‌ స్క్వాడ్రన్లలోకి ఎంత త్వరగా అందుబాటులోకి వస్తాయన్నది ప్రశ్న.

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 06:47 AM