Share News

భారత్‌ను తగులబెట్టేందుకు ఇండియా కూటమి కుట్ర.. పీయూష్ గోయల్

ABN , Publish Date - May 24 , 2026 | 03:11 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, విపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారంనాడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అస్థిరపరచేందుకు వీరంతా కుట్రపన్నుతున్నారని, హింసను రెచ్చగొడుతున్నారని అన్నారు.

భారత్‌ను తగులబెట్టేందుకు ఇండియా కూటమి కుట్ర.. పీయూష్ గోయల్
Piyush Goel and Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, విపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఆదివారంనాడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అస్థిరపరచేందుకు వీరంతా కుట్రపన్నుతున్నారని, హింసను రెచ్చగొడుతున్నారని అన్నారు. పాలకపక్షాన్ని ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎదుర్కోవడంలో విఫలం కావడంతో ఉద్దేశపూర్వకంగా దేశంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన ఆరోపించారు.


'దేశాన్ని అస్థిరపరచేందుకు కాంగ్రెస్, విపక్ష పార్టీలు కుట్ర పన్నుతున్నాయి. దేశాన్ని అస్థిర పరచాలని ఈ టూల్‌కిట్ గ్యాంగ్ కలలు కంటోంది. రాహుల్ గాంధీ ప్రకటన ఆషామాషీగా చేసినది కాదు. దేశంలో అరాచకం వ్యాప్తి చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగం. రాజకీయ నిరాశానిస్పృహలే ఇందుకు కారణం. డైనమిక్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రజల గుండెల్లోంచి వేరుచేయలేమని, ప్రత్యక్ష ప్రజాస్వామ్య పోరులో ఓడించలేమని రాహుల్ గాంధీ అండ్ కంపెనీకి బాగా తెలుసు. దీంతో ఇప్పుడు దేశంలో హింసను రెచ్చగొట్టాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ విదేశాల్లో దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరుస్తోంది. భారత్‌పై గతంలో ఎన్నడూ లేనంత విద్వేషాన్ని వాళ్లు పెంచుకున్నారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యాన్ని కోరుతూ విదేశాలకు వెళ్తున్నారు. కాంగ్రెస్ నిజమైన ఉద్దేశం ఏమిటో రాహుల్ మాటలే చెబుతున్నాయి' అని గోయల్ ఆరోపించారు.


దేశ ప్రజల రాజకీయ స్పృహపై తమకు పూర్తి విశ్వాసముందని, ఇండియా కూటమి పన్నాగాలను మరోసారి ప్రజలు తిప్పికొట్టాలని పీయూష్ గోయల్ కోరారు. ఈ దేశ ప్రజలు తెలివైన వారని, రాహుల్ గాంధీ, విపక్షాలు, టూల్‌కిట్ గ్యాంగ్ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న విషయం వారికి బాగా తెలుసునని అన్నారు. ఇండియాను తగులబట్టాయని కలలుగంటున్న ఇండియా కూటమి కుట్రలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని అన్నారు.


రాహుల్ ఏమన్నారు?

నీట్ యూజీ పేపర్ లీక్ కావడంపై యువజన కాంగ్రెస్ నిరసనలకు రాహుల్ మద్దతు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తున్న పేపర్ లీకేజీలపై ప్రధానమంత్రి మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని అన్నారు. పరీక్షా పత్రం లీకేజీపై ప్రశ్నించిన నిరసనకారులపై బీజేపీ ప్రభుత్వం లాఠీల వర్షం కురిపించిందంటూ ఒక వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. పేపర్ లీక్‌లపై యువత న్యాయంకోరుతూ రోడ్లపైకి వస్తుంటే ప్రధానమంత్రి మోదీ ఇటలీలో జార్జియా మెలోనికి ట్రోఫీలు బహుకరిస్తూ, రీల్స్ చేస్తున్నారని విమర్శించారు. నీట్ పేపర్ లీక్‌తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని, అనేక మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారని అన్నారు. దీనికి ప్రధానమంత్రి బాధ్యత వహించడం కానీ, ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడం కానీ, కనీసం ఒక్క మాట మాట్లాడటం కానీ చేయలేదని అన్నారు. న్యాయం కోరుతూ ఎన్ఎస్‌యూఐ, ఐఎన్‌సీ కార్తకర్తలు నిరసనలకు దిగితే లాఠీలు ఝళిపిస్తున్నారని, ప్రభుత్వం జవాబుదారీతనం లేకుండా పారిపోతోందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దోచుకుంటున్న ప్రభత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

అభిజీత్ దీప్కే, కిరణ్ రిజిజు మధ్య సోషల్ మీడియా వార్..

కాంగ్రెస్ వాళ్లని దరిదాపుల్లోకి రానివ్వొద్దు.. విజయ్‌కు మద్దతివ్వడంపై ఉదయనిధి ఆగ్రహం..

Updated Date - May 24 , 2026 | 03:32 PM