Share News

ముందస్తుగా నైరుతి రుతుపవనాలు.. ఈసారి వానలు ఎక్కువే!

ABN , Publish Date - May 02 , 2026 | 07:30 AM

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే నెల చివరి వారంలో వచ్చే రుతుపవనాలు, ఈసారి మే 14 - 16 మధ్యలోనే అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయని పేర్కొంది.

ముందస్తుగా నైరుతి రుతుపవనాలు.. ఈసారి వానలు ఎక్కువే!
IMD Forecast 2026: Early Monsoon Arrival in India

ఢిల్లీ, మే 2: వేసవి భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా మే నెల చివరి వారంలో వచ్చే రుతుపవనాలు, ఈసారి మే 14 నుంచి 16 మధ్యలోనే అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయని వెల్లడించింది. మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణాది, పశ్చిమ భారతంలో కుండపోత వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, ఈశాన్య, తూర్పు మధ్య భారతంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని చెప్పింది.


రాత్రిపూట కూడా తప్పని సెగలు!

వర్షాల సూచన ఉన్నప్పటికీ, ఎండల తీవ్రత విషయంలో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మే నెలలో పగటి ఉష్ణోగ్రతలే కాకుండా, రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయని పేర్కొంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా లేదా అంతకంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి తీరప్రాంత రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉండనుంది. సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన గాలుల వల్ల ఉష్ణోగ్రతలు తక్కువగా అనిపించినా, ఉక్కపోత (Humidity) విపరీతంగా ఉంటుందని తెలిపింది. రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News and National News

Updated Date - May 02 , 2026 | 07:54 AM