పాటల హక్కుల వివాదం.. ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Jul 01 , 2026 | 03:15 PM
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు 134 సినిమాల పాటల యాజమాన్య హక్కులకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు 134 సినిమాల పాటల యాజమాన్య హక్కులకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో జారీ చేసిన మధ్యంతర నిషేధాజ్ఞను ఎత్తివేయాలని ఇళయరాజా దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ వివాదంలో ప్రముఖ సంగీత సంస్థ సారేగామా (Saregama) 134 చిత్రాల్లోని పాటలపై తమకే కాపీరైట్ హక్కులు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. మరోవైపు, తాను స్వరపరిచిన పాటలపై తనకూ హక్కులు ఉన్నాయని ఇళయరాజా వాదిస్తున్నారు. ఈ అంశంపై ఇరు పక్షాల మధ్య న్యాయపోరాటం కొనసాగుతోంది.
మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలన్న ఇళయరాజా అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాటిని ఎత్తివేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కాపీరైట్ వివాదంపై తుది విచారణ పూర్తై.. తుది తీర్పు వెలువడే వరకూ ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. ఈ కేసు తుది తీర్పు సంగీత పరిశ్రమలో కాపీరైట్ హక్కుల విషయంలో కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
సాయికృష్ణ కేసు.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు 14 రోజుల రిమాండ్
Read Latest AP News And Telugu News