ఉగ్ర ముప్పు హెచ్చరికల వేళ.. కశ్మీర్‌లో ఐఈడీని గుర్తించిన సైనికులు
ABN , Publish Date - Feb 21 , 2026 | 05:41 PM
ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.
జమ్మూకశ్మీర్, ఫిబ్రవరి 21: ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) దాడులకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐఈడీ బాంబులతో దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్ లో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.
గండేర్‌బాల్ జిల్లాలో రోడ్డు పక్కన ఓ బ్యాగులో మందుపాతర(ఐఈడీ)ను భారత సైన్యం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ సాయంతో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు. సఫాపోరా ప్రాంతంలోని కోహెస్తాన్ కాలనీకి సమీపంలోని గులాబ్ షేక్ మొహల్లా వద్ద రోడ్డుపక్కన ఐఈడీ ఉన్న బ్యాగును అధికారులు గుర్తించారు. భద్రతా దళాలు(Security forces) ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
అలానే మరికొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఏమైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలను కోరారు. ఉగ్ర ముప్పు(Terror alert) పొంచిఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీస్ బృందాలు, భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ప్రముఖ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
యూపీలో దారుణం: భార్యపై మూడు రౌండ్ల కాల్పులు జరిపిన భర్త.. చివరకు..
33 మంది చిన్నారులపై లైంగిక దాడి.. దంపతులకు ఉరి శిక్ష..