వందే భారత్ రైళ్లను నడిపేదెవరో తెలుసా..? జీతం ఎంతంటే..!
ABN , Publish Date - Jul 29 , 2026 | 02:48 PM
భారతీయ రైల్వే వ్యవస్థలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న ప్రత్యేకత గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ వేగం, సూపర్ డిజైన్, ఆధునాతన సౌకర్యాలతో ఈ రైలు ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైల్వే వ్యవస్థలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న ప్రత్యేకత గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ వేగం, సూపర్ డిజైన్, విమానాల్లో మాదిరి ఉండే సౌకర్యాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. చాలా మంది ప్రయాణికులు ఖర్చుకు వెనుకాడకుండా ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ప్రీమియం రైళ్లను నడిపే లోకో పైలట్ల ఎంపిక, అర్హతలు, జీతభత్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రయాణికుల్లో నెలకొంది.
ప్రత్యేక నియామకం ఉండదు:
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను నేరుగా ప్రత్యేకంగా రైల్వే శాఖ ఎంపిక చేయదు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా నిర్వహించే పరీక్షల ద్వారా అభ్యర్థులు మొదట 'అసిస్టెంట్ లోకో పైలట్' (ALP)గా ఉద్యోగంలో చేరాలి. ఆ తర్వాత వివిధ రైళ్లను నడుపుతూ అపారమైన అనుభవాన్ని గడించాలి. మంచి సేవా రికార్డు, భద్రతా ప్రమాణాలు పాటించిన సీనియర్ పైలట్లకు మాత్రమే వందే భారత్ రైళ్లను నడిపేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ కఠినమైన శిక్షణ పూర్తి చేసుకున్న వారినే వందే భారత్ లోకో పైలట్లుగా నియమిస్తారు.
అర్హతలు:
అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) కావడానికి అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే రైల్వే నిబంధనల ప్రకారం అత్యున్నత వైద్య ప్రమాణాలు, కంటి చూపు అర్హతలు తప్పనిసరి.
జీతభత్యాలు:
లోకో పైలట్ల వేతనాలు వారి అనుభవం, గ్రేడ్‌పై ఆధారపడి ఉంటాయి. అసిస్టెంట్ లోకో పైలట్ ప్రాథమిక వేతనం రూ.19,900 నుంచి ప్రారంభమవుతుంది. వివిధ భత్యాలు కలుపుకుని చేతికి అందే జీతం నెలకు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుంది. అదే వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను నడిపే అనుభవజ్ఞులైన సీనియర్ లోకో పైలట్లకు సీనియారిటీ, రన్నింగ్ అలవెన్సులు, డ్యూటీ గంటలను అనుసరించి నెలకు లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ వేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, రన్నింగ్ అలవెన్సులతో పాటు వైద్య సౌకర్యాలు, ప్రయాణ రాయితీలు వంటి అనేక ప్రయోజనాలు రైల్వే శాఖ అందిస్తుంది.
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..