ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్..
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:23 AM
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా మార్కెట్ విలువలో 'ఎన్విడియా'ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా అవతరించింది.
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా మార్కెట్ విలువలో 'ఎన్విడియా'ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా అవతరించింది. తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.477 లక్షల కోట్లు) మార్కెట్ క్యాపిటలైజేషన్ మైలురాయిని కూడా తాకింది. 'ఎన్విడియా' తర్వాత ఈ స్థాయిని చేరుకున్న ప్రపంచ రెండో కంపెనీగా యాపిల్ చరిత్ర సృష్టించింది (Apple $5 Trillion).
మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ సందర్భంగా యాపిల్ షేరు ధర గరిష్ఠంగా 342.89 డాలర్లకు చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 5.036 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే ట్రేడింగ్ చివర్లో షేరు ధర కొంత తగ్గడంతో మార్కెట్ క్యాప్ మళ్లీ 5 ట్రిలియన్ డాలర్ల కంటే దిగువకు చేరింది. 2026లో ఇప్పటివరకు యాపిల్ షేరు సుమారు 25 శాతం పెరిగింది. ఇతర టెక్నాలజీ కంపెనీల మాదిరిగా కృత్రిమ మేధ (ఏఐ)పై భారీగా ఖర్చు చేయకుండా, లాభాలను కొనసాగించడం, ఖర్చులను సమర్థంగా నియంత్రించడం కలిసొచ్చింది (World's Most Valuable Company).
త్వరలో యాపిల్ తన తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే సుమారు 15 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫలితాలు కూడా కంపెనీ షేరు ధరపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా, ఏడాది కాలంగా చిప్ తయారీ కంపెనీ అయిన 'ఎన్విడియా'నే అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతూ వచ్చింది (Apple Market Cap).
ఏఐ యూనిట్లకు అవసరమయ్యే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ)కు భారీగా డిమాండ్ రావడంతో 2025లో 'ఎన్విడియా' రూ.5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను అధిగమించిన తొలి కంపెనీగా నిలిచింది (Nvidia share price). అయితే ఏఐపై పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్విడియా షేర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో సోమవారం ఎన్విడియా షేర్లు 5 శాతం మేర నష్టపోయాయి.
ఇవి కూడా చదవండి..
విదేశీయులే లక్ష్యంగా కోట్ల రూపాయల సైబర్ మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్
నేనెక్కడికీ పారిపోలేదు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి