భారత చమురు ట్యాంకర్ వెనక్కి.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!
ABN , Publish Date - Jul 08 , 2026 | 08:22 PM
పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఒమన్ కారిడార్ గుండా ప్రయాణిస్తున్న ఓ భారత చమురు ట్యాంకర్‌ను ఇరాన్ భద్రతా దళాలు వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు సమాచారం.
న్యూఢిల్లీ, జులై 8: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ పరస్పర సైనిక దాడులతో వ్యూహాత్మక హోర్మూజ్ జలసంధిలో (Strait of Hormuz) యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ఒమన్ కారిడార్ గుండా ప్రయాణిస్తున్న ఓ భారత చమురు ట్యాంకర్‌ను ఇరాన్ భద్రతా దళాలు అడ్డుకుని, వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. అమెరికా పర్యవేక్షణలో సాగుతున్న ఒమన్ తాత్కాలిక కారిడార్‌ను కాకుండా, హోర్ముజ్ జలసంధిలో తాము నిర్దేశించిన మార్గంలోనే వెళ్లాలంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నౌకలను హెచ్చరిస్తుండటం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
కారిడార్ వివాదం ఏంటి?
గల్ఫ్ సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన వివిధ దేశాల వాణిజ్య నౌకలు వాటి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేందుకు వీలుగా ఒమన్ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (UNIMO)లు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాయి. ఒమన్ తీరం వెంబడి వెళ్లేలా అమెరికా భద్రతా పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక కారిడార్‌నే ప్రస్తుతం నౌకలు ఉపయోగిస్తున్నాయి. అయితే, ఈ మార్గంపై ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాము సూచించిన హోర్మూజ్ మార్గాన్నే వినియోగించుకోవాలని నౌకలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది.
హోర్మూజ్‌లో 9 భారత నౌకలు.. 198 మంది నావికుల బందీ!
జలసంధి దిగ్బంధనం కావడంతో ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లోనే తొమ్మిది భారతీయ చమురు ట్యాంకర్లు చిక్కుకుపోయాయి. వీటిలో పూర్తి స్థాయిలో ముడిచమురు (Crude Oil), ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) లోడ్ అయి ఉన్నట్లు సమాచారం. ఈ నౌకల్లో సుమారు 198 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు. గత కొన్ని నెలలుగా హోర్మూజ్ జలసంధి మూతపడటంతో వందలాది మంది నావికులు ఇక్కడే చిక్కుకుపోగా, తాజాగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో వీరి రక్షణపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్ నెలలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ మరింత అప్రమత్తమైంది.
రంగంలోకి భారత ప్రభుత్వం.. ఇరాన్‌తో సంప్రదింపులు?
పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను, భారత నౌకల కదలికలను ఢిల్లీలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. నిలిచిపోయిన తొమ్మిది చమురు ట్యాంకర్లకు మార్గాన్ని సుగమం చేయడంతో పాటు, 198 మంది భారతీయ నావికులను క్షేమంగా తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ఇరాన్ ఉన్నతాధికారులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు ఉన్న అన్ని దౌత్యపరమైన అవకాశాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఇవి కూడా చదవండి..
అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రంలో గాలింపు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..