డీలిమిటేషన్‌కు సుదీర్ఘ చరిత్ర
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:46 AM
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దేశ స్వాతంత్య్రానికి ముందే దీనికి సంబంధించిన మూలాలున్నాయి
1952లో తొలి డీ లిమిటేషన్ కమిషన్.. 1951 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల విభజన
1963, 1973ల్లో కొనసాగిన ప్రక్రియ
2001లో వాజపేయి హయాంలో..
(సెంట్రల్ డెస్క్)
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దేశ స్వాతంత్య్రానికి ముందే దీనికి సంబంధించిన మూలాలున్నాయి. బ్రిటీష్ కాలంలోనే ఈ ప్రక్రియ మొదలైంది. ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’ ద్వారా ఎన్నికలతో ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే వ్యవస్థకు, స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు నాటి బ్రిటీష్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే 1936లో సర్ లారీ హామండ్ సారథ్యంలో భారత డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఏయే రాష్ట్రాలకు ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి, వాటి సరిహద్దులు ఏమిటి అన్న అంశాలపై ఈ కమిషన్ కసరత్తు జరిపింది. మూడు గ్రంథాలుగా ఉన్న ఈ కమిటీ నివేదిక ఇప్పటికీ ఎన్నికల సంఘం చారిత్రక పత్రాల్లో భాగంగా ఉంది. స్వాతంత్ర్యానంతరం 1951లో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు మరోసారి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగింది. ‘పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉత్తర్వు, 1951’ ద్వారా నియోజకవర్గాల సరిహద్దులను ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత పార్లమెంటు ఆమోదించిన బిల్లు ద్వారా 1952లో తొలి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. 1951 జనాభా లెక్కల ఆధారంగా ఇది నియోజకవర్గాల సంఖ్యను, వాటి సరిహద్దులను నిర్ణయించింది. ఇదే ప్రక్రియ ఆ తర్వాత రెండు దశాబ్దాలు కొనసాగింది. 1961 జనాభా లెక్కల తర్వాత రెండో డీ లిమిటేషన్ కమిషన్ 1963లో, 1971 జనాభా లెక్కల అనంతరం మూడో డీలిమిటేషన్ కమిషన్ 1973లో ఏర్పాటయ్యాయి. ఇవన్నీ కూడా పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంటులో, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉండే సీట్లను, వాటి సరిహద్దులను నిర్ణయించాయి. ఈ కమిషన్లకు విశేషమైన అధికారాలున్నాయి. వాటి నిర్ణయాలను సాధారణంగా కోర్టుల్లో కూడా సవాల్ చేయటానికి వీలు కాదు. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత.. నియోజకవర్గాల సంఖ్యనుగానీ, సరిహద్దులనుగానీ పార్లమెంటు, అసెంబ్లీలు మార్చటానికి అవకాశం ఉండదు.
ఎమర్జెన్సీ సమయంలో నిలిపివేత
స్వాతంత్య్రానంతరం తొలి 3 దశాబ్దాలపాటు డీలిమిటేషన్ ప్రక్రియ ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగింది. అయితే, 1976లో దేశం ఎమర్జెన్సీ కింద ఉన్న సమయంలో.. లోక్‌సభ సీట్ల పెంపును నిలిపివేస్తూ పార్లమెంటు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. దీనికి కారణం.. జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచే పాత ప్రక్రియ ప్రకారం ముందుకు వెళ్తే, జనాభా పెరుగుదలను సమర్థవంతంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉండటమే. దీంతో 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు జరిగిన లోక్‌సభ సీట్ల కేటాయింపును 25 ఏళ్లపాటు స్తంభింపజేస్తూ బిల్లును ఆమోదించారు. దీని ప్రకారం 2000 తర్వాత జరిగే జనగణన అనంతరమే మళ్లీ డీలిమిటేషన్‌ను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. 2001లో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉన్న సమయంలో.. గడువు సమీపించింది. వాజపేయి సర్కారు కూడా ఇందిరాగాంధీ సర్కారులాగే ఈ అంశాన్ని భవిష్యత్తుకు వదిలేస్తూ.. లోక్‌సభ సీట్ల పెంపు అంశాన్ని మరో 25 ఏళ్లకు వాయిదా వేసింది. 2026 తర్వాత జరిగే జనగణన ఆధారంగా రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొంటూ 84వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. అప్పటి న్యాయశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. జనాభాను సమర్థవంతంగా నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరగవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అయితే, 2003లో పార్లమెంటు ఆమోదించిన 87వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చటానికి వీలు కలిగింది.
సరిహద్దుల్లో మార్పులు చేర్పులు
2002లో జస్టిస్ కుల్దీప్ సింగ్ సారథ్యంలో 4వ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. 2001 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను మార్చే పనిని ఈ కమిషన్‌కు అప్పగించారు. ఈ కమిషన్ నియోజకవర్గాల సరిహద్దులతోపాటు, ఎస్సీ ఎస్టీ రిజర్వుడు సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులు చేసింది. మొత్తంగా లోక్‌సభ సీట్ల సంఖ్యలో ఎటువంటి మార్పు రాలేదు. అనంతరం, 2020లో జమ్ముకశ్మీర్‌లో, 2023లో అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అసెంబ్లీ, లోక్‌సభల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెడుతూ కేంద్రప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేక వీగిపోయింది. ఆ తర్వాత మెజారిటీ సాధన కోసం అధికారపార్టీ బీజేపీ కసరత్తు జరిపి.. తాజాగా మరోసారి ఆ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టటానికి సిద్ధమైంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 25ఏళ్లపాటు లోక్‌సభ సీట్ల సంఖ్యను స్తంభింపజేస్తూ బిల్లులో ప్రతిపాదనలు చేయటం విశేషం.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి