Share News

హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం.. భారీ వర్షాలకు 157 మంది మృతి..

ABN , Publish Date - Aug 11 , 2026 | 03:32 PM

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 157 మంది మృతిచెందగా.. 257 మంది గల్లంతయ్యారు.

హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం.. భారీ వర్షాలకు 157 మంది మృతి..
Rains in Himachal Pradesh

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 157 మంది మృతిచెందగా.. 257 మంది గల్లంతయ్యారు. జూన్ 30 నుంచి ఆగస్టు 9 మధ్య కాలంలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి కారణాలతో ఏకంగా 68 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 89 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు దాదాపు 900 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు రూ.886 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం వెల్లడించింది.


మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కుల్లు, మండి జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సుమారు 161 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు) వారం రోజులుగా పని చేయడం లేదు. వీటిలో అత్యధికంగా మండిలో 77, సిమ్లాలో 43, కుల్లులో 40 డీటీఆర్‌లు పని చేయకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల కారణంగా ఏటా కురిసే భారీ వర్షాల మాదిరిగానే ఈ ఏడాదీ వానలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా కుల్లు అంతటా నదులు, వాగుల్లో నీటిమట్టాలు అకస్మాత్తుగా పెరిగాయి. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు ముంచెత్తడం వంటి భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.


అలాగే పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడం వల్ల సుమారు 259 రహదారులు ధ్వంసమయ్యాయి. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన మండిలో 120 రోడ్లు మూతపడగా.. ఆ తర్వాత చంబా- 42, కుల్లు- 40, సిమ్లాలో 30 చొప్పున రోడ్లు దెబ్బతిన్నాయి. కాగా, రహదారులను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పని చేస్తుండగా.. వర్షాల కారణంగా ఆటంకం ఎదురవుతోంది. దీనికి తోడు హిమాచల్ ప్రదేశ్ అంతటా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారిక లెక్కల ప్రకారం 54 నీటి సరఫరా పథకాలు ప్రభావితమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


కాగా, ఇంత నష్టం జరిగినా హిమాచల్ ప్రదేశ్ కష్టాలు మాత్రం ఇంకా తీరలేదు. కాంగ్రా, మండి, హమీర్‌పూర్, సిమ్లా, సిర్మౌర్ జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు సిమ్లా ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే చంబా, కుల్లు, సోలన్, బిలాస్‌పూర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి

కేరళ పేరును కేరళంగా మార్చే బిల్లుకు లోక్‌సభ ఆమోదం..

అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..

Updated Date - Aug 11 , 2026 | 03:49 PM