Share News

సీఈసీపై పోరుకు ఇండియా కూటమి సిద్ధం.. సెప్టెంబర్ 30న కీలక సమావేశం

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:21 PM

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఒత్తిడి పెంచేందుకు ఇండియా కూటమిలోని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీన ఆ పార్టీల అగ్రనేతలు సమావేశం కానున్నారు.

సీఈసీపై పోరుకు ఇండియా కూటమి సిద్ధం.. సెప్టెంబర్ 30న కీలక సమావేశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఒత్తిడి పెంచేందుకు ఇండియా కూటమిలోని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీన ఆ పార్టీల అగ్రనేతలు సమావేశం కానున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వేదికగా ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఆయా పార్టీల అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ తదితరులు హాజరవుతారని తెలుస్తోంది.


ఈ సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వారంతా చర్చించనున్నారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై స్వతంత్ర విచారణ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతోపాటు అందుకోసం దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసనలు, ఆందోళనలకు రోడ్డు మ్యాప్‌పై వారంతా చర్చించనున్నారు. మరికొద్ది నెలల్లో పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కూటమిలోని నేతలు అడుగులు వేస్తున్నారు. ఇక ఈ భేటీపై ఇప్పటికే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీతోపాటు సీపీఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీతో ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.


భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ చేపట్టింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లలో ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో మిగిలిన ఇద్దరు కమిషనర్లు సుఖబీర్ సింగ్ సందు, వివేక్ జోషిలు తీవ్రంగా వ్యతిరేకించినట్లు అంగ్ల మీడియాలో ఓ కథనం ఇటీవల ప్రచురితమైంది. ఇద్దరు కమిషనర్ల ప్రమేయం లేకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆ కథనంలో పేర్కొంది.


ఈ కథనంపై దేశంలోని రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చీఫ్ అభిజిత్ దిప్కే.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీమానా చేయాలని డిమాండ్ చేశారు. అందుకు గడువు కూడా విధించారు. సీఈసీ రాజీనామా చేయకుంటే.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని సీజేపీ చీఫ్ ఆల్టిమేటం జారీ చేశారు.


మరో వైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు ఎస్ఐఆర్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోట్లాది ప్రజల ఓటు హక్కును.. ఓటర్లు జాబితా నుంచి తొలగించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాంటి వేళ సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామాపై ఇండియా కూటమిలోని పార్టీలన్ని సమావేశమయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం షాపుల్లో సీసీ టీవీ కెమెరాలు.. ట్రాకింగ్ విధానంతో పంపిణీ: మంత్రి కొల్లు రవీంద్ర

టీడీపీ కన్నతల్లిలాంటిది.. వైసీపీ కసాయి పార్టీ: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

Read Latest National News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 06:50 PM