Share News

పదేళ్లకు పుట్టిందోచ్.. కచ్‌లో 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల జననం

ABN , Publish Date - Mar 29 , 2026 | 08:24 AM

అరుదైన పక్షి జాతి 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో జన్మించింది. పక్షి పిల్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. దీంతో అంతరించిపోతున్న ఈ ప్రత్యేక పక్షి జాతి మనుగడపై కొత్త ఆశలు చిగురించినట్లైంది.

పదేళ్లకు పుట్టిందోచ్.. కచ్‌లో 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల జననం
Great Indian Bustard chick born

భుజ్ (గుజరాత్) మార్చి 29: పర్యావరణ ప్రేమికులకు మాత్రమే కాదు.. సకల మానవాళికి, వన్యప్రాణి శాస్త్రవేత్తలకు ఇది ఒక తీపి కబురు. గత పదేళ్లుగా నిరీక్షిస్తున్న అద్భుతం గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఆవిష్కృతమైంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఒకటైన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (Great Indian Bustard - GIB) పక్షి పిల్ల కచ్ గడ్డి భూముల్లో జన్మించింది.

కచ్‌లోని అబ్దాసా ప్రాంతంలో ఉన్న లాలా-పరజన్ అభయారణ్యం సమీపంలో ఈ పక్షి పిల్ల కనిపించింది. 2016 తర్వాత ఈ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఒక పక్షి పిల్ల జన్మించడం ఇదే మొదటిసారి. అటవీ శాఖ అధికారులు ఈ పక్షి పిల్లను గుర్తించి, దాని కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ఇది ఆ జాతి మనుగడపై కొత్త ఆశలను చిగురింపజేస్తోందని అధికారులు పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షుల సంఖ్య కేవలం 150 కన్నా తక్కువగా ఉంది. వీటిలో అత్యధికంగా రాజస్థాన్‌లో ఉండగా.. గుజరాత్ వంటి ప్రాంతాల్లో వీటి సంఖ్య అతి స్వల్పంగా ఉంది. ఈ పక్షి పిల్ల, దాని తల్లి సురక్షితంగా ఉండేలా అటవీ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతంలో కుక్కల బెడద, ఇతర పక్షుల దాడుల నుండి రక్షణ కల్పిస్తున్నారు.


ఈ పక్షులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య

ఈ పక్షులు ఎగురుతున్నప్పుడు విద్యుత్ తీగలను ఢీకొని ప్రాణాలు కోల్పోతుంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కూడా ఈ పక్షులు తిరిగే ప్రాంతాల్లో విద్యుత్ తీగలను భూగర్భం ద్వారా పంపాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. కచ్‌లోని గడ్డి భూముల (Grasslands) విస్తీర్ణం తగ్గడం కూడా వీటి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో పదేళ్ల తర్వాత కొత్త పక్షి పిల్ల జన్మించడం అనేది ప్రకృతి పరంగా ఒక గొప్ప పరిణామం. ఈ పక్షి పిల్ల జననంపై కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సైతం ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 09:08 AM