యుద్ధం ఎఫెక్ట్‌పై భయాందోళనలు సృష్టిస్తున్న కాంగ్రెస్... అస్సాంలో ప్రధానమంత్రి మోదీ
ABN , Publish Date - Mar 14 , 2026 | 03:17 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని సిల్చార్‌లో శనివారంనాడు పర్యటించారు. రూ.23,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.22,864 కోట్లతో సిల్చార్-మేఘాలయలోని షిల్లాంగ్ మధ్య నిర్మించనున్న యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు భూమి పూజ చేశారు.
సిల్చార్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అస్సాంలోని సిల్చార్‌లో శనివారంనాడు పర్యటించారు. రూ.23,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.22,864 కోట్లతో సిల్చార్-మేఘాలయలోని షిల్లాంగ్ మధ్య నిర్మించనున్న యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం దేశంపై సాధ్యమైనంత తక్కువగా ఉండేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. అయితే ఇందుకు భిన్నంగా ఏమాత్రం బాధ్యతలేని విపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ఆరోపించారు. అస్సాం ప్రజలను హింస, ఉగ్రవాదం వైపు కాంగ్రెస్ తప్పుదారి పట్టించిందని, అయితే ఇవాళ రాష్ట్రంలో సమృద్ధిగా అవకాశాలు ఉన్నాయని అన్నారు
'ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. దేశ ప్రజలపై ఆ ప్రభావం తగ్గించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వారి రక్షణ, శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆశిస్తాం. అయితే దేశ ప్రయోజనాల పరిరక్షణలో కాంగ్రెస్ మరోసారి విఫలమైంది. దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. మోదీని దూషించడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయంగా భారత్ శీఘ్ర అభివృద్ధిని సాధించడం కొన్ని శక్తులకు ఇష్టంలేదు. అలాంటి శక్తుల చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారింది' అని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
విజన్ లేని కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి అస్సాం గురించి కానీ, దేశం గురించి కానీ ఎలాంటి విజన్ లేదని మోదీ తప్పుపట్టారు. మోదీని దూషించడం, అబద్ధాలు, వదంతుల ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించడమే ఆ పార్టీకి తెలుసునని అన్నారు. బీజేపీ ప్రభుత్వం యువతకు అనేక అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో, అక్కడి నుంచే తమ పని ప్రారంభమవుతుందని, అభివృద్ధిలో వెనుకబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమే బీజేపీ ప్రధాన మంత్రమని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు.. ఫలించిన భారత్ దౌత్యం
సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం