సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:34 PM
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దు చేస్తూ కేంద్రం శనివారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై గత ఏడాది సెప్టెంబర్ 26న వాంగ్‌చుక్‌ను నిర్బంధంలోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) నిర్బంధాన్ని రద్దు చేస్తూ కేంద్రం శనివారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై గత ఏడాది సెప్టెంబర్ 26న వాంగ్‌చుక్‌ను నిర్బంధంలోకి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన ఆయన అప్పట్నించి జోధ్‌పూర్ జైలులో ఉంటున్నారు. హింసాత్మక ఘటనల అనంతరం శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను నిర్బంధంలోకి తీసుసుకున్నట్టు దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది.
తక్షణమే ఆదేశాలు అమలు
లద్దాఖ్‌లో శాంతియుత వాతావరణం, సుస్థిరత, పరస్వర విశ్వాసాన్ని పాదుకొలిపేందుకు, భాగస్వామ్య పక్షాలతో అర్ధవంతమైన చర్చలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ లక్ష్య సాధన కోసం తగిన పరిశీలన అనంతరం జాతీయ భద్రతా చట్టం కింద తమకు సంక్రమించిన అధికారులను ఉపయోగించుకుని వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. లద్దాక్ ప్రజల ఆకాంక్షలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని భాగస్వామ్య పక్షాలు, కమ్యూనిటీ లీడర్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది.
లేహ్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లోకి చేర్చాలని, రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్లతో చేపట్టిన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు చనిపోగా, సుమారు 90 మంది గాయపడ్డారు. హింసను ప్రేరేపించారంటూ వాంగ్‌చుక్‌ను నిర్బంధంలోకి తీసుకున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వీలైతే ఆయన నిర్బంధాన్ని సమీక్షించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది.
ఇవి కూడా చదవండి..
అమెరికాతో వాణిజ్య ఒప్పందం..ఇప్పట్లో సంతకాలు లేనట్లే..?
అనిల్ అంబానీ కుమారుడ్ని విచారించిన సీబీఐ