Share News

అమెరికాతో వాణిజ్య ఒప్పందం..ఇప్పట్లో సంతకాలు లేనట్లే..?

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:39 AM

అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్‌ ఆచితూచి వ్యవహరిస్తోందని, ఒప్పందంపై భారత్‌ ఇప్పట్లో సంతకాలు చేసే పరిస్థితి కనిపించడం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం..ఇప్పట్లో సంతకాలు లేనట్లే..?

న్యూఢిల్లీ, మార్చి 13: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్‌ ఆచితూచి వ్యవహరిస్తోందని, ఒప్పందంపై భారత్‌ ఇప్పట్లో సంతకాలు చేసే పరిస్థితి కనిపించడం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ నెలలోనే ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంది. కానీ, ట్రంప్‌ విధించిన సుంకాలు చెల్లవన్న అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ విషయమై మరికొద్ది నెలలు వేచి చూడాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ట్రంప్‌ సుంకాలను కొట్టివేసిన తర్వాత ఇరుదేశాల మధ్య చర్చలు జరగలేదు. అదేసమయంలో ఇరాన్‌పై ఆమెరికా యుద్ధం మొదలుపెట్టింది. భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..వివిధ దేశాలపై సుంకాలు విధించేందుకు ట్రంప్‌ వద్ద అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు. ‘మేం ఒప్పందాలు చేసుకున్న దేశాలు వాటిని గౌరవిస్తాయని ఆశిస్తున్నాం’ అని చెప్పారు. భారత్‌ కూడా ఒప్పందాన్ని గౌరవిస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని, నిలిచిపోలేదని కేంద్ర వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - Mar 14 , 2026 | 04:39 AM