సుప్రీం కోర్టులోనూ ఏఐ?
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:36 AM
సుప్రీం కోర్టు కూడా అధునాతన కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వినియోగంవైపు అడుగులు వేస్తోంది. కేసుల లిస్టింగ్, బెంచ్‌ల కేటాయింపులో సిబ్బంది జోక్యాన్ని ...
కొత్త టెక్నాలజీ వినియోగానికి సీజేఐ సమ్మతి
న్యూఢిల్లీ, మార్చి 13: సుప్రీం కోర్టు కూడా అధునాతన కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వినియోగంవైపు అడుగులు వేస్తోంది. కేసుల లిస్టింగ్, బెంచ్‌ల కేటాయింపులో సిబ్బంది జోక్యాన్ని తగ్గించేందుకు ఏఐని అత్యున్నత న్యాయస్థానం వినియోగించనున్నట్లు బార్ అండ్ బెంచ్ నివేదిక తెలిపింది. ఏఐ నిర్ణయానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సమ్మతించినట్లు వెల్లడించింది. మాస్టర్ ఆఫ్ ది రోస్టర్‌గా ఉండే సీజేఐ ప్రస్తుతం కేసులను వివిధ బెంచ్‌లకు కేటాయిస్తున్నారు. అయితే సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో చాలామంది అధికారులు అదే స్థానంలో ఏళ్లుగా పాతుకుపోయి ఉన్నారు. అలాగే పాతకాలంనాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండటం వల్ల అడ్మినిస్ట్రేషన్‌లో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. కేసుల కేటాయింపుల్లో తప్పులు దొర్లుతున్నాయి. ఈ ప్రధాన సంస్థాగత వైఫల్యాలు అంతర్గత విచారణలో బయటపడటంతో సంస్కరణలు చేపట్టారు. పాతుకుపోయిన రిజిస్ట్రీ అధికారులను అంతర్గతంగా బదిలీ చేశారు. ఈ పాలనా వైఫల్యాన్ని ఇటీవల చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ బాగ్చి, జస్టిస్ పంచోలి ధర్మాసనం ఓ కేసు విచారణ సందర్భంగా గుర్తించింది. ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ 1986ను సవాల్ చేస్తూ ఇర్ఫాన్ సోలంకి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల విచారించిన సందర్భంగా ఆ వైఫల్యం బయటపడింది. ఈ పిటిషన్‌పై యూపీ ప్రభుత్వం స్పందిస్తూ.. ఇలాంటి సవాల్‌నే ఎండీ అనాస్ చౌధరి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో 2022లోనే సుప్రీం కోర్టు కొట్టివేసిందని తెలిపింది. అప్పట్లో ఇలాంటి కేసును కొట్టివేసినా కూడా మరోసారి తాజాగా విచారణకు రావడం పట్ల సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు.