Share News

అత్యాచారం కేసు నిందితుడికి ఘన స్వాగతం.. వైరల్ వీడియో..

ABN , Publish Date - May 19 , 2026 | 06:20 PM

ఉత్తర్ ప్రదేశ్‌లో న్యాయ విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెయిల్‌పై బయటకు వచ్చిన అతనికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అత్యాచారం కేసు నిందితుడికి ఘన స్వాగతం.. వైరల్ వీడియో..

ఘజియాబాద్: ఉత్తర్ ప్రదేశ్‌లో న్యాయ విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ యువ వాహిని మాజీ సభ్యుడు సుశీల్ ప్రజాపతి తొమ్మిది నెలల కిందట ఓ విద్యార్థినిపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. న్యాయవాదికి పరిచయం చేస్తాననే నెపంతో ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం ఘజియాబాద్ జైలుకు తరలించారు.


తొమ్మిది నెలలుగా సుశీల్ ప్రజాపతి అదే జైలులో ఉన్నాడు. అయితే, నిందితుడి అభ్యర్థన మేరకు కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై విడుదలైన సుశీల్ ప్రజాపతి వీడియో సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది. మే 17న సుశీల్ విడుదల సందర్భంగా ఘజియాబాద్ జైలు వద్దకు అతని మద్దతుదారులు పెద్దఎత్తున చేరుకున్నారు. నిందితుడు బయటకు వచ్చిన అనంతరం పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. కొంతమంది అతని ఆశీర్వాదం తీసుకోగా, మరికొంతమంది ఆప్యాయంగా పలకరించారు. అనంతరం తమ భుజాలపై సుశీల్‌ను ఎత్తుకుని రోడ్‌షో నిర్వహించారు.


విజయోత్సవ ర్యాలీ చేపట్టి సుశీల్‌కి మద్దతుగా నినాదాలు చేస్తూ రోడ్లపై హంగామా సృష్టించారు. కొంతమంది ఈ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అత్యాచారం కేసు నిందితులకు స్వాగతాలు ఏంటని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇటీవల అత్యాచారం కేసుల్లో బెయిల్‌పై విడుదలైన పలువురు నిందితులు, దోషులపైనా ఇలాగే విమర్శలు వెల్లువెత్తాయి. నేరం రుజువైన తర్వాత కూడా వారిని ఇంతలా అభిమానించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారు.. ఏడాదిలో రెండోసారి

బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్

Updated Date - May 19 , 2026 | 06:22 PM