వీడియో వైరల్.. భార్యాభర్తలు అరెస్టు..
ABN , Publish Date - May 19 , 2026 | 04:56 PM
త్రిపురలో భార్యాభర్తలైన ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుచగా న్యాయస్థానం వారికి ఏడు రోజుల పాటు పోలీస్ రిమాండ్ విధించింది.
అగర్తలా: త్రిపురలో భార్యాభర్తలైన ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుచగా న్యాయస్థానం వారికి ఏడు రోజుల పాటు పోలీస్ రిమాండ్ విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అగర్తలా తూర్పు పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ మేనకా దెబ్బర్మ పనిచేస్తున్నారు. త్రిపుర స్టేట్ రైఫిల్స్ 14వ బెటాలియన్‌లో ఆమె భర్త అజిత్ దెబ్బర్మ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, కొన్ని రోజుల కిందట వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు అయ్యింది.
వీడియో ప్రకారం.. ఓ పూజా గదిలో రూ.500, రూ.200, రూ.100 నోట్ల కట్టలు నేలపై పేర్చి ఉన్నాయి. వాటి ముందు మేనకా దెబ్బర్మ కూర్చొని ఉన్నారు. అంత డబ్బు తమ వద్ద ఉండడంతో ఆమె ఎంతో సంతోషంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అయింది. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి విషయం చేరడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియోలో కనిపిస్తున్న డబ్బు మొత్తం ధలాయ్ జిల్లాలో జరిగిన ఓ ఆర్థిక కుంభకోణానికి సంబంధించినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ మేరకు మేనకా దెబ్బర్మ, అజిత్ దెబ్బర్మను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులకు ఏడు రోజుల పాటు పోలీస్ రిమాండ్ విధించింది. పోలీస్ కస్టడీలో నిందితులిద్దరూ ఎలాంటి విషయాలు వెల్లడిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
మమతా బెనర్జీకి షాక్.. పోటీ నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి..
ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు