జెన్‌జీ.. రూటే సపరేటు!
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:47 AM
ఉద్యమమంటే.. ఆవేశపూరిత నినాదాలు, ఉద్రిక్తతలు, దూకుడుగా ముందుకెళ్లడాలు.. ఇదంతా పాత తరం పద్ధతి. కానీ ఇప్పుడు సీజేపీ నేతృత్వంలో జెన్ జెడ్ చేస్తున్నది సృజనాత్మక సంగ్రామం...
ఉద్యమమంటే.. ఆవేశపూరిత నినాదాలు, ఉద్రిక్తతలు, దూకుడుగా ముందుకెళ్లడాలు.. ఇదంతా పాత తరం పద్ధతి. కానీ ఇప్పుడు సీజేపీ నేతృత్వంలో జెన్ జెడ్ చేస్తున్నది సృజనాత్మక సంగ్రామం. వ్యంగ్య వ్యాఖ్యలతో ప్లకార్డుల ప్రదర్శనలు.. వాటర్ క్యానన్ల కింద డ్యాన్సులు.. రోడ్లపైనే మాక్ పరీక్షలు.. ‘మనీ హెయిస్ట్’లా ఎగ్జామ్ దోపిడీ నినాదాలు.. డైనోసార్లు, స్పైడర్‌మ్యాన్‌లు, సూపర్‌మ్యాన్‌లు.. పేపర్ లీకేజీలపై విద్యార్థులు ఇలాంటి వినూత్న ప్రదర్శనలతో నిరసనలు తెలుపుతున్నారు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఓ విద్యార్థి పూర్తిగా తెల్లగా ఉన్న ఒక ప్లకార్డు పట్టుకుని తిరుగుతూ కనిపించాడు. ఏమీ రాయలేదేమిటని అడిగితే... ‘‘గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలన్నీ రాశాను. ఒకవైపు స్థలం చాలక రెండోవైపూ రాశాను. కాకపోతే అవన్నీ కనిపించాలంటే అంధ భక్తులై ఉండాలి..’’ అని సమాధానం చెప్పాడు.
దేశవిదేశాల్లోని చాలా మంది జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకారుల కోసం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ పంపిస్తున్నారు. తమకు ఫుడ్ అవసరం లేదని, నిరసనల తర్వాత రోజూ ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి డస్ట్‌బిన్‌లు, పెద్ద చీపుర్లు కావాలని విద్యార్థులు తెలిపారు. దీనితో చాలా మంది జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి యాప్‌లలో డస్ట్‌బిన్‌లు, చీపుర్లు వంటివి ఆర్డర్ చేసి.. జంతర్‌మంతర్ వద్దకు డెలివరీ చేయిస్తున్నారు.
మోదీ క్యాబినెట్ (మంత్రివర్గం) కంటే ఐకియా స్టోర్‌లో దొరికే క్యాబినెట్ (అల్మారా) చాలా బాగుంటుందని వ్యంగ్యంగా ప్లకార్డును ప్రదర్శిస్తున్న ఓ యువతి
కొందరు జంతర్‌మంతర్ వద్ద ఫుట్‌పాత్‌పై పరీక్ష హాల్‌లో పరీక్ష రాస్తున్నట్టుగా, ఆ పక్కనే ప్రశ్నపత్రాలు అమ్ముతాం అంటూ మరికొందరు తిరుగుతున్నట్టుగా వీధి నాటకాలు వేస్తూ ఆకట్టుకుంటున్నారు.
బిహార్‌లోని పట్నాలో పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగిస్తే.. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో చాలా మంది ఆ నీటి కింద తడుస్తూ, డ్యాన్సులు చేస్తూ నిరసన కొనసాగించారు.
ఒకచోట విద్యార్థులను భద్రతా బలగాలు వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళుతుండగా.. మరికొందరు విద్యార్థులు ఆపి, వ్యాన్ వెనుకవైపు తలుపు తెరిచారు. లోపలున్న విద్యార్థులంతా కిందికి దిగారు. వారు ఎలాంటి ఆవేశపూరిత నినాదాలు, వాదనలేమీ చేయలేదు. పాటలు పెట్టుకుని అంతా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు.
ఈ నెల 20న విద్యార్థులపై భద్రతా బలగాలు భారీగా లాఠీచార్జి చేసి చెదరగొట్టాయి. చివరికి బలగాలు తిరిగి వెళుతుంటే.. ‘చాలా మంచి పనిచేశారు, ఇంటికి వెళ్లాక విద్యార్థులను కొట్టామని మీవాళ్లకు చెప్పండి’ అని విద్యార్థులంతా చప్పట్లు కొడుతూ సాగనంపారు.
భద్రతా బలగాలు గన్‌లతో గస్తీకాస్తుంటే.. జెన్ జీ నిరసనకారులు తాగిపడేసిన కూల్‌డ్రింక్ టిన్నులు, సిగరెట్ పెట్టెలను తెల్లటి టేప్‌తో అంటించి గన్‌లలా తయారు చేసి, మా వద్దా తుపాకులు ఉన్నాయంటూ వ్యంగ్య నిరసనలు తెలిపారు.
ఢిల్లీలో ఒక చోట టియర్‌గ్యాస్ గన్ పట్టుకున్న జవాను వద్దకు కొందరు విద్యార్థులు వెళ్లారు. ‘‘ఇది టియర్ గ్యాస్ గన్ కదా సర్.. మేం ఎన్నడూ చూడలేదు. ఒక్కసారి ప్రయోగించండి, కనీసం పనిచేస్తుందో, లేదో అయినా టెస్ట్ చేయండి’’ అని వెంటపడ్డారు. సదరు జవాను నవ్వుతూ వెళ్లిపోయాడు.
జంతర్ మంతర్ వద్ద ‘మనీ హెయిస్ట్’ తరహాలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News