5శాతం జనాభా ఉన్న వర్గానికి సుప్రీంలో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం
ABN , Publish Date - Nov 28 , 2026 | 04:03 AM
దేశ అత్యున్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు అన్యాయం
ఉన్నత న్యాయస్థానాల్లో అసమానతలు!
కొలీజియం పనితీరు కూడా సరిగా లేదు
మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్ అసంతృప్తి
రాష్ట్రపతికి లేఖ.. జోక్యం చేసుకోవాలని వినతి
న్యూఢిల్లీ, నవంబరు 27: దేశ అత్యున్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జిల నియామకాలు, బదిలీల వ్యవహారంలో సామాజిక న్యాయం, సమానత్వం, ప్రతిభకు ప్రాధాన్యం లభించడం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకుమూడు పేజీల లేఖ రాశారు. ఉన్నత న్యాయవ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కొలీజియం సిఫారసుల్లో ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ, మిగిలిన వర్గాలను విస్మరిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోందని పేర్కొన్నారు. జడ్జిల నియామకాలు, పదోన్నతులు, బదిలీల విషయంలో ఇటీవలి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని లేఖలో తెలిపారు. తాను కొలీజియంలో సభ్యుడిగా ఉన్నప్పుడు, సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో సామాజిక వైవిధ్యం, సమ్మిళితత్వానికి ప్రాధాన్యమిచ్చానని గుర్తుచేశారు.
ఇటీవలి కాలంలో ఈ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న భావన కలుగుతోందన్నారు. ఐదు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న ఒక సామాజిక వర్గానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం లభించిందని, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగిందని వివరించారు. 2018 నుంచి నియమితులైన 715 మంది హైకోర్టు న్యాయమూర్తుల్లో ఎస్సీలు 22 మంది, ఎస్టీలు 16 మంది, ఓబీసీలు 89 మంది, మైనారిటీ వర్గాలకు చెందినవారు 37మంది మాత్రమేనని వివరించారు. రాజ్యాంగ న్యాయస్థానాల్లోని న్యాయమూర్తుల్లో సుమారు మూడొంతుల మంది జనరల్ కేటగిరీకి చెందినవారేనని పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి 2026 జనవరి వరకు జరిగిన నియామకాల్లో అగ్రవర్ణాల ప్రాతినిధ్యం దాదాపు 80 శాతానికి చేరగా, దేశ జనాభాలో 40-50 శాతం వరకు ఉన్న ఓబీసీలకు 14 శాతం కంటే తక్కువ ప్రాతినిధ్యమే లభించిందని లేఖలో వివరించారు. ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు, అక్కడి నుంచి మరింత చిన్న హైకోర్టుకు బదిలీ అయిన ఓ ప్రధాన న్యాయమూర్తిని.. ఇప్పుడు ప్రముఖ హైకోర్టుకు బదిలీ చేసేలా సిఫారసు చేయడంలో సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారన్న అభిప్రాయంవ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ఇలాం టి పరిణామాలు ప్రతిభావంతులైన జడ్జిల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు.ఉన్నత న్యాయవ్యవస్థలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. ఈ లేఖ ప్రతులను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కూ పంపించారు. గతంలో కొలీజియం వ్యవస్థకు మద్దతుగా మాట్లాడిన గవాయ్.. ఇప్పుడు అదే వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలూ చదవండి
నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం
త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా