ఫరీదాబాద్‌లో స్కూల్‌లోనే టీచర్ దారుణ హత్య.. ముసుగు ధరించి వచ్చి కత్తితో దాడి..
ABN , Publish Date - Aug 03 , 2026 | 09:38 PM
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇవాళ (సోమవారం) ఉదయం జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. పాఠశాలకు ముసుగు ధరించి వచ్చిన ఓ దుండగుడు.. ఉపాధ్యాయురాలిని ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు.
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇవాళ (సోమవారం) ఉదయం జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. పాఠశాలకు ముసుగు ధరించి వచ్చిన ఓ దుండగుడు.. ఉపాధ్యాయురాలిని ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోగా గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు పాఠశాల సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సంధ్య (30) పని చేస్తోంది. సోమవారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో ఓ దుండగుడు పాఠశాల వద్దకు ముసుగు ధరించి వచ్చాడు. స్కూల్ గేటు వద్ద నిలబడి అక్కడే ఉన్న సిబ్బందికి సంధ్యను కలిసేందుకు వచ్చానని చెప్పాడు. ఆమెను బయటకు పిలవాలని కోరాడు. సంధ్య బయటకు రాగానే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. క్షణాల వ్యవధిలోనే ఛాతి, పొట్ట, మెడ భాగాలపై విచక్షణారహితంగా పలుమార్లు పొడిచాడు. బాధితురాలి కేకలు విన్న పాఠశాల నిర్వాహకుడు వారి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు.
అప్పటికే రక్తపు మడుగులో సంధ్య పడి ఉండటంతో ఆమెను రక్షించేందుకు ప్రయత్నించాడు. అతనిపైనా దుండగుడు దాడికి యత్నించడంతో నిర్వాహకుడు లోపలికి పరిగెత్తాడు. అనంతరం కిందపడి ఉన్న సంధ్య గొంతుపై దుండగుడు పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత నంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సంధ్యను పాఠశాల సిబ్బంది వెంటనే అల్ ఫలాహ్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంపై మొత్తం 27 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. అయితే, సంధ్యపై దాడి చేసింది అమిత్ అనే వ్యక్తి అని స్థానికులు ఆరోపించారు. ఆమెను గతంలోనూ అతడు వేధించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సిక్రోనా పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే అమిత్‌ను అదుపులోకి తీసుకుని దాడి వెనుక గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించడంతో పాటు విద్యార్థుల్లో భయాందోళనలు నింపింది.
ఈ వార్తలు కూడా చదవండి
జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాలి.. ప్రధాని వీడియో తొలగింపుపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం..
తృణమూల్ కాంగ్రెస్‌కు నేతాజీ బంధువు చంద్ర కుమార్ బోస్ రాజీనామా