Share News

వంటింట్లోకీ.. ఇథనాల్‌..!

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:00 AM

పెట్రోల్‌ బంకుకు వెళితే మన వాహనాల్లో ఈ-20 పెట్రోల్‌ పోస్తున్నారు కదా! త్వరలో మీ వంటగదిలోకి కూడా ఇథనాల్‌ ప్రవేశించవచ్చు! ఎల్పీజీ గ్యాస్‌ మాదిరిగానే ఇథనాల్‌నూ వంట ఇంధనం...

వంటింట్లోకీ.. ఇథనాల్‌..!

త్వరలో ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా..

ఇందుకు ప్రత్యేకంగా సూపర్‌ బ్లూ స్టవ్‌లు

బంకుల్లో ఏటీఎంలు.. డబ్బాల్లో నింపుకోవాలి

ఎల్పీజీలాగే ఇథనాల్‌కు సబ్సిడీ.. స్టవ్‌లకూ!

తగ్గనున్న ఎల్పీజీ దిగుమతుల భారం

వినియోగంలోకి మిగులు ఇథనాల్‌

చెరకు, మక్క రైతులకు ఎంతో ఉపయోగం

సెప్టెంబరు నాటికి సిద్ధంకానున్న ప్రణాళిక

బ్లెండింగ్‌ 20ు మించి పెంచే ఆలోచన లేదు

పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపి

న్యూఢిల్లీ, జూలై 20: పెట్రోల్‌ బంకుకు వెళితే మన వాహనాల్లో ఈ-20 పెట్రోల్‌ పోస్తున్నారు కదా! త్వరలో మీ వంటగదిలోకి కూడా ఇథనాల్‌ ప్రవేశించవచ్చు! ఎల్పీజీ గ్యాస్‌ మాదిరిగానే ఇథనాల్‌నూ వంట ఇంధనం (కుకింగ్‌ ఫ్యూయల్‌)గా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం అవుతోంది. దేశంలో ఇప్పటికే ఎల్పీజీ కొరత ఏర్పడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా వంట గ్యాస్‌ దిగుమతి అనేది భారంగా మారింది. పెట్రోలు వాహనాల్లో ఇప్పటికే 20శాతం ఇఽథనాల్‌ కలుపుతున్నా, దేశ అవసరాలకు మించి ఇఽథనాల్‌ మిగులుతోంది. మున్ముందు 700 కోట్ల లీటర్ల మేర ఇఽథనాల్‌ మిగిలే అవకాశాలున్నాయని ఇప్పటికే లెక్కలు వేశారు. ఈ క్రమంలో ఇఽథనాల్‌ను కుకింగ్‌ ఫ్యూయల్‌గానూ అందుబాటులోకి తెస్తే ఆ మిగులు ఇఽథనాల్‌ను సమర్థంగా వాడుకున్నట్లవుతుందని, పనిలో పనిగా ఎల్పీజీ దిగుమతుల భారం చాలా వరకు తగ్గుతుందని కేంద్రం ఆలోచిస్తోంది. చెరకు, మొక్కజొన్న నుంచి ఇఽథనాల్‌ ఉత్పత్తి అవుతుంది కాబట్టి మున్ముందు ఇథనాల్‌ను పెద్ద మొత్తంలో కుకింగ్‌ ఫ్యూయల్‌గా ప్రవేశపెడితే.. రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తోంది. ఎల్పీజీ సిలిండర్లకు ఇస్తున్నట్లే కుకింగ్‌ ఇఽథనాల్‌కూ సబ్సిడీ వర్తింపజేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇఽథనాల్‌ను ఎల్పీజీ గ్యాస్‌కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించే పాలసీ సెప్టెంబరు నాటికి సిద్ధం అవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.


ఎలా పనిచేస్తుంది?

ఇథనాల్‌ కుకింగ్‌ ఫ్యూయల్‌గా ఉపయోగించాలంటే ప్రత్యేక స్టవ్‌ అవసరం. ప్రస్తుతం మీ వంటిట్లో ఉన్న గ్యాస్‌ స్టవ్‌ పనికిరాదు. దీనిపై ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఇఽథనాల్‌తో పనిచేసే స్టవ్‌లను పరిచయం చేశారు. 93శాతం ఇఽథనాల్‌, 7 శాతం నీటి మిశ్రమంతో వెలిగే ఈ ఇంధనం ఎల్బీజీ కన్నా చౌకగా లభిస్తుందని ఆయన వివరించారు. ప్రాథమిక పరీక్షల ప్రకారం ఒక లీటరు ఇఽథనాల్‌తో దాదాపు 15 గంటల పాటు వంట చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక అమల్లోకి వస్తే వంటగదిలో కొన్ని మార్పులు చూడబోతున్నామన్నమాటే! ఇఽథనాల్‌ను కుకింగ్‌ ఫ్యూయల్‌గా ఉపయోగించాలంటే ప్రత్యేకంగా సూపర్‌ బ్లూ స్టవ్‌ కావాలి. దీన్ని కూడా వినియోగదారులకు సబ్సిడీ కింద ఇచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లను డెలివరీ బాయ్స్‌ నేరుగా ఇంటికి తెచ్చి వేస్తున్నారు కదా.. ఇఽథనాల్‌ను అలా ఇవ్వరు. మనమే డబ్బాలు తీసుకొని పెట్రోలు బంక్‌లకు వెళ్లాలి. అక్కడ లిక్విడ్‌ రూపంలో ఇఽథనాల్‌ను విక్రయిస్తారు. ఇందుకుగాను బంకుల్లో ప్రత్యేకంగా ఇఽథనాల్‌ ఏటీఎం(కియో్‌స్క)లను ఏర్పాటు చేయనున్నారు. ఆటోమెటిక్‌ మెషిన్ల ద్వారా డబ్బాల్లో ఇఽథనాల్‌ను నింపుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికైతే ఈ-20నే

  • కేంద్ర సహాయ మంత్రి సురేశ్‌ గోపి

పెట్రోల్లో 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్‌ కలపాలా?వద్దా? అనే అంశంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపి తెలిపారు. సమగ్ర పరిశోధనలు చేసి, ఆయిల్‌, ఆటోమొబైల్‌ కంపెనీలతో చర్చలు జరిపాకే భవిష్యత్తులో పెట్రోల్లో ఇథనాల్‌ మోతాదు పెంచుతామని వివరించారు. ఈ మేరకు రాజ్యసభలో సోమవారం ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్‌ కలపాలన్న లక్ష్యాన్ని భారత్‌ అనుకున్నదాని కంటే ఐదేళ్లు ముందేగానే సాధించిందని చెప్పారు. 2013-14లో పెట్రోల్లో కేవలం 1.53 శాతం ఉన్న ఇథనాల్‌ 2025-26 నాటికి ఇరవై శాతానికి చేరిందని వెల్లడించారు. దశాబ్దకాలంలో ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌ వల్ల 1.97 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని పేర్కొన్నారు. ఇథనాల్‌ వ్యవసాయ ముడిపదార్థాల నుంచి ఉత్పత్తి అవుతుంది కాబట్టి రైతులకు 1.66 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కాగా ఈ-20 పెట్రోల్‌ వినియోగంపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై సురేశ్‌ గోపి స్పందించారు. ఈ రకం పెట్రోల్‌ కారణంగా వాహనాలు దెబ్బతిన్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులేమీ రాలేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.

Updated Date - Jul 21 , 2026 | 06:00 AM