Share News

ఈపీఎఫ్‌వో పెన్షనర్ల పింఛను పెంపు?

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:31 AM

ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరటనిచ్చే పరిణామం చోటు చేసుకోనుంది.

ఈపీఎఫ్‌వో పెన్షనర్ల పింఛను పెంపు?
pension

  • నవంబరు 19న బోర్డు భేటీలో ఈ అంశంపై చర్చకు అవకాశం

  • పెన్షన్‌ కనీస మొత్తాన్ని రూ.7500కు పెంచాలన్న డిమాండ్‌పై పరిశీలన

న్యూఢిల్లీ, అక్టోబరు 24 : ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరటనిచ్చే పరిణామం చోటు చేసుకోనుంది. ఈపీఎఫ్‌వో(ఉద్యోగుల భవిష్య నిధి) పెన్షన్‌దారులు అందుకునే నెలవారీ పెన్షన్‌ కనీస మొత్తం పెంపు ప్రతిపాదనపై త్వరలో కీలక చర్చ జరగనుంది. నవంబరు 19న జరగనున్న ఈపీఎఫ్‌వో బోర్డు 240వ సమావేశం ఇందుకు వేదిక కానుంది. పెన్షన్‌ కనీస మొత్తం పెంపు అంశమే అజెండాగా ఈ భేటీ జరగనుందని ఈపీఎ్‌ఫవో వర్గాలు అనధికారికంగా పేర్కొన్నాయి. గుజరాత్‌లోని గిర్‌ వేదికగా జరగనున్న ఈ సమావేశం అజెండాపై అధికారిక ప్రకటన లేదు. కాగా, 2014 సెప్టెంబరు నుంచి పెన్షన్‌ కనీస మొత్తాన్ని కేంద్రం రూ.1000గా అమలు చేస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సొమ్ము ఏమాత్రం సరిపోదని, కనీస పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.7,500కు పెంచడంతోపాటు కరువు భత్యాన్ని కూడా వర్తింప జేయాలని రిటైర్డు ఉద్యోగుల సంఘాలు, కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ, నెలవారీ పెన్షన్‌ పెంపు ఆర్థికంగా చాలా భారమని కేంద్రం చెబుతోంది. మరోపక్క, ఈపీఎఫ్‌వో తప్పనిసరి కవరేజ్‌ వేతన పరిమితిని కేంద్రం ఇటీవల రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. ఈ క్రమంలో పెన్షన్‌ కనీస మొత్తం పెంపు అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా, అధిక వేతనం ఆధారంగా పెన్షన్‌ పొందేందుకు ఉమ్మడి ఆప్షన్‌ సమర్పించిన ఆరుగురు రిటైర్డు ఉద్యోగులకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మినహాయింపు పొందిన సంస్థల పీఎఫ్‌ ట్రస్ట్‌ నిబంధనలను సాకుగా చూపి వారి దరఖాస్తులను ఈపీఎఫ్‌వో తిరస్కరించడాన్ని తప్పుబట్టింది.


ట్రస్టు నిబంధనల్లో యజమాని చందాపై గరిష్ఠ పరిమితి ఉన్నా, అధిక పెన్షన్‌ కోసం చందా చెల్లించే నిబంధన లేకపోయినా ఉద్యోగుల దరఖాస్తులను తిరస్కరించరాదని స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి ..

పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా

ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష

Updated Date - Oct 25 , 2026 | 05:41 AM