12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:10 PM
రాజ్యసభలో ఖాళీ కానున్న 12 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఖాళీ అయిన మరో స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు.
ఢిల్లీ: రాజ్యసభలో ఖాళీ కానున్న 12 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఖాళీ అయిన మరో స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని రాజ్యసభ స్థానం రుక్మిణి మల్లిక్ రాజీనామాతో 2026 జులై 16న ఖాళీ అయింది. ఈ స్థానానికీ ఇదే షెడ్యూల్ ప్రకారం ఉపఎన్నిక జరగనుంది.
ఎన్నికల షెడ్యూల్ ఇదే..
ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 29న విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 6 చివరి తేదీగా ఈసీ నిర్ణయించింది. అక్టోబర్ 7న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 9 వరకు గడువు ఇచ్చారు. అక్టోబర్ 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను అక్టోబర్ 19లోపు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది.
బ్యాలెట్‌పై ప్రత్యేక నిబంధన..
రాజ్యసభ ఎన్నికల్లో బ్యాలెట్‌పై ప్రాధాన్యం గుర్తులను నమోదు చేసేందుకు రిటర్నింగ్ అధికారి అందించే నిర్దిష్ట వైలెట్ రంగు స్కెచ్ పెన్‌ను మాత్రమే ఉపయోగించాలని ఈసీ స్పష్టం చేసింది. ఇతర పెన్నులతో గుర్తులు వేయకూడదని పేర్కొంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పరిశీలకులను నియమించి, మొత్తం ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు తెలిపింది.
ముగియనున్న పలువురు నేతల పదవీకాలం..
నవంబర్ 25తో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సహా పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. వీరిలో ఉత్తర ప్రదేశ్ నుంచి బీజేపీ నాయకులు అరుణ్ సింగ్, గీతా షాక్య, నీరజ్ శేఖర్, బ్రిజ్‌లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేది, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీకి చెందిన రామ్జీ గౌతమ్ ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్కులో బాలికపై సామూహిక అత్యాచారం.. పోలీసులమని బెదిరిస్తూ..
విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్..