Share News

ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్.. నిరసనల వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..

ABN , Publish Date - Oct 07 , 2026 | 08:36 PM

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ భారత ఎన్నికల సంఘం కీలక చర్య చేపట్టింది. సర్ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది.

ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్.. నిరసనల వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
Election Commission voter enrolment

ఇంటర్నెట్ డెస్క్: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ భారత ఎన్నికల సంఘం కీలక చర్య చేపట్టింది. 'సర్' ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. జాబితాలో చోటు దక్కని అర్హులైన ఓటర్లు, కొత్తగా ఓటు హక్కు పొందిన యువత కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది (EC special drive).


'సర్‌'కు ముందు ఓటర్ల జాబితాలో పేరు ఉండి.. సవరణ తర్వాత కనిపించని అర్హులైన వ్యక్తులను ఈ ప్రత్యేక కార్యక్రమంలో గుర్తించనున్నారు. అలాగే 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు, యువ ఓటర్లు కూడా తమ పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో బూత్ స్థాయి అధికారులు (BLO) కీలక పాత్ర పోషించనున్నారు. వారు 'సర్‌'కు ముందు ఉన్న ఓటర్ల జాబితాను, ప్రస్తుత జాబితాను పోల్చి.. గతంలో పేరు ఉండి ప్రస్తుతం కనిపించని వారి వివరాలను గుర్తిస్తారు (Form 6 voter registration).


అవసరమైన చోట ఇంటింటికీ వెళ్లి వివరాలను ధ్రువీకరిస్తారు. వ్యక్తి అర్హుడిగా తేలితే అక్కడే ఫారం-6 దరఖాస్తును పూర్తి చేయించేందుకు సహకరిస్తారు. బూత్ స్థాయి అధికారులకు ఎన్నికల సంఘం నిర్దిష్ట లక్ష్యాన్ని కూడా ఇచ్చింది. ఒక్కో బీఎల్‌ఓ వారానికి 20 నుంచి 25 మంది ఓటర్లను పరిశీలించేలా, మొత్తం కార్యక్రమాన్ని సుమారు ఒక నెలలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఓటర్ల నమోదును సులభతరం చేసేందుకు బూత్ స్థాయి శిబిరాలు నిర్వహించాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది (EC voter enrolment).


ఇప్పటికే 'సర్' పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 'సర్' ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘంపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రెండ్రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది.


ఇవి కూడా చదవండి..

రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..


యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Oct 07 , 2026 | 08:54 PM