పోలింగ్ వేళ బాంబుదాడులు జరక్కుండా రంగంలోకి ఎన్ఐఏ
ABN , Publish Date - Apr 28 , 2026 | 08:24 PM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండోవిడత పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని రంగంలోకి దించింది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండోవిడత పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)ని రంగంలోకి దించింది. దుండగులు బాంబులతో ఓటింగ్ ప్రక్రియను దెబ్బతీసి, రాజకీయ పార్టీల కార్యకర్తలను టార్గెట్ చేసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ఐఏ టీమ్‌లను మోహరించినట్టు ఈసీ అధికారులు మంగళవారంనాడు తెలిపారు. పోలింగ్‌కు ముందు రాష్ట్రంలో పలుచోట్ల బాంబులు స్వాధీనం చేసుకోవడం, చిన్నచిన్న పేలుళ్ల ఘటనలు వెలుగుచూడటంతో ఈసీ ఈ చర్యలు చేపట్టింది.
పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు, ఓటర్ల నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు.
సౌత్ 24 పరగణాల జిల్లాలోని భాంగర్‌లో ఈనెల 26న రఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి ఇంటిపై దాడులు జరిపి 79 నాటుబాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తునకు కూడా కేంద్ర హోం శాఖ ఆదేశాలిచ్చింది. హోం శాఖ ఆదేశాలతో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది.
కాగా, ఈనెల 29వ తేదీ బుధవారంనాడు జరిగే తుదివిడత పోలింగ్ కోసం 41 వేల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 2,321 కంపెనీల కేంద్రబలగాలను మోహరించారు. అత్యధికంగా కోల్‌కతాలో 272 కంపెనీల బలగాలను రంగంలోకి దించారు. 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను కూడా విధుల్లో ఉన్నారు. పోలింగ్ ప్రక్రియను మానిటర్ చేసేందుకు కెమెరాలతో కూడిన డ్రోన్‌లను వాడనున్నారు.
ఇవి కూడా చదవండి..
అభిషేక్ బెనర్జీ కంచుకోటలో యూపీ సింగం.. వీడియో వైరల్
న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్