ప్రధాని మోదీకి ఫోన్ చెయ్.. అమెరికా రాయబారి సర్జియో గోర్‌తో డొనాల్డ్ ట్రంప్..
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:59 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్నేహితుడు అంటూ ప్రపంచ వేదికలపై ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని తెలియజేసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్నేహితుడు అంటూ ప్రపంచ వేదికలపై ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని తెలియజేసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని మయామీలో ఈ ఏడాది ఏప్రిల్ 11న UFC 327 ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీకి ఫోన్ చేయాలని డొనాల్డ్ ట్రంప్ అనుకున్నారట. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సర్జియో గోర్ తెలిపారు.
ఈ అంశాన్ని అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య లీడర్‌షిప్ సమ్మిట్ (USISPF) వేదికగా గోర్ వెల్లడించారు. 'UFC 327 ఈవెంట్ వేదిక వెనుక ఉన్నప్పుడు మోదీకి ఫోన్ చేద్దామని ట్రంప్ నాతో అన్నారు. ఆ సమయంలో భారత్‌లో ఉదయం 6 గంటలని, ఇది తగిన సమయం కాదని సూచించా. అయినా ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మోదీ మేల్కొనే ఉంటారు, ఆయన కూడా నాలాగే తక్కువగా నిద్రపోతారని అన్నారు. ఆ తర్వాత ట్రంప్ వేదికపైకి వెళ్లాల్సి రావడంతో ఆ కాల్‌ను మరుసటి రోజుకు షెడ్యూల్ చేశారు' అని గోర్ తెలిపారు.
ఈ ఘటన అమెరికా-భారత్ సంబంధాల్లో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తోందని సర్జియో గోర్ చెప్పుకొచ్చారు. స్నేహం ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉండదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ట్రంప్‌నకు భారత్‌పై ప్రత్యేక అభిమానం ఉందని, మోదీతో ఆయన సంబంధం ఇతర ప్రపంచ నేతలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందన్నారు. కొంతమంది నేతలతో తాము ఫార్మల్‌గా మాత్రమే వ్యవహరిస్తామని, కానీ ప్రధాని మోదీ విషయంలో అలా ఉండదని పేర్కొన్నారు. అలాగే భారత్ పర్యటన జ్ఞాపకాలను ట్రంప్ తరచూ గుర్తు చేసుకుంటారని గోర్ తెలిపారు.
ఇక అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం చివరి దశలో ఉందని, కేవలం ఒక శాతం చర్చలు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు. కాగా, గోర్ వ్యాఖ్యలు ట్రంప్-మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని మరోసారి చర్చనీయాంశం చేశాయి.
ఇవి కూడా చదవండి..
రెండో రోజూ నష్టాలే.. 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..
ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..