Share News

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

ABN , Publish Date - Jun 30 , 2026 | 09:22 AM

కర్ణాటకలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక హెచ్చరిక చేశారు.

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..
DK Shivakumar

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక హెచ్చరిక చేశారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే కేవలం ఓటు హక్కే కాకుండా, భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చని ఆయన హెచ్చరించారు. ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు (Karnataka SIR 2026).


'ఓటు హక్కు అంటే జీవించే హక్కు. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. పశ్చిమ బెంగాల్‌లో అనర్హ రేషన్ కార్డు లబ్దిదారులను గుర్తించేందుకు ఇలాంటి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తరహా చర్యలు చేపడుతున్నాయి. ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది' అని శివకుమార్ పేర్కొన్నారు (Karnataka CM DK Shivakumar).


భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నుంచి జూలై 29 వరకు కర్ణాటకలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే కార్యక్రమం కొనసాగుతుంది (Karnataka voter list). రాష్ట్రవ్యాప్తంగా వేలాది బూత్ స్థాయి అధికారులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. కాగా, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌తో పాటు ప్రభుత్వ సేవా కేంద్రాల్లో కూడా పొందవచ్చు. ఇది నివాసానికి అధికారిక ఆధార పత్రంగా ఉపయోగపడుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్

డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత

Updated Date - Jun 30 , 2026 | 09:22 AM