Share News

డీకే ప్రమాణస్వీకారం తేదీ ఖరారు.. ప్రకటించిన కేసీ వేణుగోపాల్

ABN , Publish Date - May 30 , 2026 | 07:42 PM

కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే తేదీని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ప్రకటించారు.

డీకే ప్రమాణస్వీకారం తేదీ ఖరారు.. ప్రకటించిన కేసీ వేణుగోపాల్
KC Venugopal with DK Shivakumar

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అధికారికంగా తేదీ ఖరారైంది. జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ప్రకటించారు.


సీఎల్‌పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నికైన అనంతరం మీడియాతో ఆ వివరాలను కేసీ వేణుగోపాల్ పంచుకున్నారు. సీఎల్‌పీ నేతగా డీకే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చెప్పారు. డీకే పేరును కాంగ్రెస్ అధిష్టానం సూచించగా, తొలుత సిద్ధరామయ్య, ఆ తర్వాత పరమేశ్వర ఆయన పేరును సీఎల్‌పీ సమావేశంలో ప్రతిపాదించారని, ఏకగ్రీవంగా దీనికి ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారని వివరించారు. ముఖ్యమంత్రి మార్పు కాంగ్రెస్ పార్టీకి సమస్య అవుతుందని అంతా భావించారనీ, అయితే తమదంతా ఒక కుటుంబమని, అంతా ఏకగ్రీవంగా ఈ ఎన్నికను ఆమోదించడం పార్టీకి గర్వకారణమని అన్నారు. 2028లోనూ నాయకులందరికీ సపోర్ట్‌తో కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అదికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో సిద్ధరామయ్య ఈనెల 28న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంతవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సిద్ధరామయ్యకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ సూచించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది.

Updated Date - May 30 , 2026 | 08:00 PM