Share News

ఆ చట్టంతో జర్నలిజానికి సమాధే!

ABN , Publish Date - Oct 28 , 2026 | 04:07 AM

సమాచారాన్ని ప్రచురించేముందు సంబంధిత వ్యక్తుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ‘డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ’ (డీపీడీపీ) చట్టం, నిబంధనలతో వార్తాసంస్థలను మూసుకోవాల్సి వస్తుందని దేశంలోని ప్రముఖ డిజిటల్‌ న్యూస్‌ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి

ఆ చట్టంతో జర్నలిజానికి సమాధే!
journalism

  • అవినీతిపరుడి గురించి రాయాలంటే

  • అతడి అనుమతి తీసుకోవాలా?

  • పరిశోధనాత్మక రిపోర్టింగ్‌ చేయలేని పరిస్థితి నెలకొంటుంది

  • ‘డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ’ చట్టంపై వార్తాసంస్థల అభ్యంతరం

  • కొన్ని నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకం.. వాటిని కొట్టేయాలి

  • కేంద్రానికి కోర్టు నోటీసులు

  • ‘డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ’ చట్టంపై

  • సుప్రీంలో డిజిటల్‌ వార్తా సంస్థల పిటిషన్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 27: సమాచారాన్ని ప్రచురించేముందు సంబంధిత వ్యక్తుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ‘డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ’ (డీపీడీపీ) చట్టం, నిబంధనలతో వార్తాసంస్థలను మూసుకోవాల్సి వస్తుందని దేశంలోని ప్రముఖ డిజిటల్‌ న్యూస్‌ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒక వ్యక్తి దుష్ప్రవర్తన, అవినీతి గురించి వార్తలు రాయాలనుకున్న విలేకరిని.. ముందుగా సదరు వ్యక్తి అనుమతి తీసుకొనిగానీ రాయటానికి వీల్లేదంటే ఇక జర్నలిజం ఉనికిలో ఎలా ఉంటుందని ప్రశ్నించాయి. 21 సంస్థలతో కూడిన ‘డిజిటల్‌ న్యూస్‌ సంస్థల సంఘం’ ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సంఘంలో అదానీ, అంబానీలకు చెందిన మీడియా సంస్థలు ఎన్‌డీటీవీ, న్యూస్‌ 18 కూడా ఉండటం విశేషం. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బాగ్చీ, జస్టిస్‌ మోహనలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. డీపీడీపీ చట్టం అమలును ఇప్పటికిప్పుడు నిలిపివేయలేమన్న ధర్మాసనం.. అభ్యంతరాలపై తొలుత కేంద్రం స్పందనను తెలుసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ, ఎలకా్ట్రనిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ‘డిజిటల్‌ న్యూస్‌సంస్థల సంఘం’ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ మాధవి దివాన్‌ వాదనలు వినిపించారు.


డీపీడీపీ చట్టం నుంచి విలేకరులకు మినహాయింపు ఇవ్వకపోవటం వల్ల వార్తా సేకరణపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది ప్రెస్‌ మీద ముందస్తు సెన్సార్‌ (ప్రీ సెన్సార్‌) విధించటం లాంటిదేనన్నారు. ఇంతకుముందున్న సంబంధిత చట్టాల్లో జర్నలిస్టులకు మినహాయింపు ఉందని, దానిని ప్రభుత్వం ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. ఈ చట్టం అమలైతే పరిశోధనాత్మక జర్నలిజం, రిపోర్టింగ్‌ వంటివి సాధ్యం కావని.. ఈ నేపథ్యంలో డీపీడీపీ చట్టంలోని పలు సెక్షన్లను, వాటికి అదనంగా నోటిఫై చేసిన నిబంధనలను రాజ్యాంగవిరుద్ధమైనవిగా ప్రకటిస్తూ వాటిని కొట్టేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. డీపీడీపీ చట్టంలోని సెక్షన్‌ 44(3) ద్వారా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 8(1)లో తీసుకొచ్చిన ‘క్లాజ్‌ జీ’ని కూడా రాజ్యాంగ విరుద్ధమైనదిగా మాధవి దివన్‌ పేర్కొన్నారు.

డీపీడీపీ నిబంధనలు ఉల్లంఘిస్తే

రూ.250 కోట్ల జరిమానా

‘డిజిటల్‌ పర్సనల్‌ డేటా పరిరక్షణ’కు సంబంధించి 2023 ఆగస్టులో కేంద్రప్రభుత్వం డీపీడీపీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్నైనా ఒక సంస్థ సేకరించటానికి, వినియోగించుకోవటానికి ముందు ఆ వ్యక్తి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, డీపీడీపీ చట్టంలోని సెక్షన్‌ 7లో పేర్కొన్న ‘చట్టబద్ధమైన ఉపయోగాలకు’ మాత్రమే ఆ వివరాలను వాడుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.250 కోట్ల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలను కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ గతేడాది నవంబరు 13వ తేదీన ప్రకటించింది.

ఇవి కూడా చదవండి..

భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య

రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు

Updated Date - Oct 28 , 2026 | 04:09 AM