ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:37 AM
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో రాజీ లేదని, దానిపై చర్చలకు కూడా ఆస్కారం లేదని కేంద్రప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తేల్చి చెప్పింది...
అంగీకరించకపోతే ఉద్యమం తీవ్రతరం
ఢిల్లీ దమనకాండపై విద్యార్థులకు కేంద్రం, ఆర్‌ఏఎఫ్, ఢిల్లీ కమిషనర్ క్షమాపణ చెప్పాలి
పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపట్టాలి
కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ డిమాండ్లు
ఢిల్లీలో నడ్డా, జితేంద్రసింగ్‌లతో సౌరవ్‌దాస్, అశుతో్‌షరంకా చర్చలు
పరిహారం, కేసుల ఉపసంహరణపై ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం
ప్రధాన్ రాజీనామాపై నిర్ణయానికి నేటి వరకు గడువు కోరింది.. సీజేపీ ప్రతినిధుల వెల్లడి
నేడు చర్చలు కొనసాగుతాయి: జేపీ నడ్డా
న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో రాజీ లేదని, దానిపై చర్చలకు కూడా ఆస్కారం లేదని కేంద్రప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తేల్చి చెప్పింది. ఈ డిమాండ్‌ను ఆమోదించకపోతే విద్యార్థి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని, ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో జరిగిన ‘చలో సంసద్’ కంటే పెద్ద ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించింది. శుక్రవారం ఢిల్లీలోని విఠల్‌భాయ్ పటేల్ హౌస్‌లో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్, సీజేపీ ప్రతినిధులు సౌరవ్‌దాస్, అశుతో్‌షరంకా మధ్య రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. మంత్రుల నివాసానికి తాము రాబోమని, తటస్థ వేదిక వద్దనైతేనే చర్చలకు వస్తామన్న సీజేపీ షరతును కేంద్రం అంగీకరించటంతో.. ముందడుగు పడింది. చర్చల అనంతరం.. సీజేపీ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించటం, ‘చలో పార్లమెంటు’ ర్యాలీ నేపథ్యంలో విద్యార్థుల మీద దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవటం అనే రెండు డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపైన మాత్రం ఏ నిర్ణయం తీసుకోవటానికి శనివారం మధ్యాహ్నం వరకూ గడువు కోరింది. అయితే, ధరేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు సౌరవ్, అశుతోష్ చెప్పారు.
మరోవైపు, జేపీ నడ్డా విలేకరులతో మాట్లాడుతూ.. సీజేపీ డిమాండ్లను విన్నామని, దానిపై ప్రభుత్వంలో చర్చించి తెలియజేస్తామని చెప్పామన్నారు. శనివారం మధ్యాహ్నం మరోమారు చర్చలు జరుగుతాయని తెలిపారు. చర్చల సందర్భంగా తమ డిమాండ్లతోపాటు ఇతర అంశాలు పేర్కొంటూ మంత్రులకు సీజేపీ ప్రతినిధులు ఒక లేఖను అందించారు. ఇరుపక్షాలకు ప్రయోజనకారిగా ఉండేలా సమస్యకు త్వరగా ఒక పరిష్కారం కనుగొనటానికి కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తాము గుర్తించామని సీజేపీ ఈ లేఖలో పేర్కొంది. ‘చలో పార్లమెంటు’ ర్యాలీలో విద్యార్థులపై తీవ్రంగా లాఠీచార్జి చేసి అనేక మందిని గాయాలపాలు చేసినందుకుగాను.. కేంద్రప్రభుత్వం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ ఏఎఫ్) అధిపతి, ఢిల్లీ పోలీసు కమిషనర్.. విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను వదులుకుంటేనే సీజేపీ చేస్తున్న మిగిలిన రెండు డిమాండ్లను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకైతే ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. ఇదిలా ఉండగా, జంతర్‌మంతర్ వద్దకు ఆహారం, నీళ్లు రాకుండా ప్రభుత్వం ఆపేసిందని సౌరవ్‌దాస్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News