Share News

సీజేపీ నిరసన.. అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ బంద్..

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:08 PM

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10 నుంచి సీజేపీ ధర్నాకు దిగనుంది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు అర్ధరాత్రి నుంచి నగరాన్ని తమ అధీనంలోకి తీసుకోనున్నారు.

సీజేపీ నిరసన.. అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ బంద్..
CJP Protest

ఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసనకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ, నిరసనకు దిగేందుకు సీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఇప్పటికే పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.


తాజా ఆదేశాల ప్రకారం.. ఈరోజు అర్ధరాత్రి నుంచి ఢిల్లీ నగరాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేయనున్నారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. దేశ రాజధానిలో దుకాణాలు, కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించారు. రాత్రి 10 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేయనున్నారు. అలాగే, న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లలో పలు సర్వీసులను నిలిపివేశారు. హోటళ్లు, పీజీ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.


సెంట్రల్ ఢిల్లీలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)లోని సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. నగరంలో ఎలాంటి నిరసనలు, ధర్నాలకు అనుమతి లేదని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా 23 వేల మంది కేంద్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.


కాగా, అక్టోబర్ 10 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే, తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును సీజేపీ ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరిపిన ధర్మాసనం.. శాంతియుత నిరసనలకు జంతర్ మంతర్ కాకుండా మరోచోట అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైన మేరకే నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

విద్యార్థి గుండుపై తబలా వాయించిన ఉపాధ్యాయుడు.. చివరికి ఏమైందంటే..

పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..

Updated Date - Oct 09 , 2026 | 07:19 PM