భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన ఉన్మాది
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:08 PM
ఢిల్లీ చందన్ పార్క్ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో పాటు ముగ్గురు పిల్లల గొంతు కోసి ముంచన్ కెవాత్ అనే వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడు. పదునైన కత్తితో నలుగురి గొంతులు కోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: దేశ రాజధానిలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక కిరాతక ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలోని చందన్ పార్క్ ఏరియాలో ఒక వ్యక్తి తన కన్నబిడ్డలపై, భార్యపై కనికరం లేకుండా కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు.
ఘటన వివరాలు..
పోలీసుల సమాచారం ప్రకారం.. ముంచన్ కెవాత్ అనే వ్యక్తి తన భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలను అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. ఇవాళ (బుధవారం) ఉదయం వీరి మృతదేహాలను పోలీసులు ఇంట్లో గుర్తించారు. మృతులంతా రక్తపు మడుగులో పడి ఉండటం చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
పోలీసుల దర్యాప్తు..
మృతుల్లో.. ముంచన్ కెవాత్ భార్య, అతని ముగ్గురు చిన్నారి కుమార్తెలు ఉన్నారు. నిందితుడు పదునైన ఆయుధంతో అందరి గొంతు కోసి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ముంచన్ కెవాత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఎందుకీ దారుణం..
కుటుంబకలహాలే ఈ హత్యలకు కారణమా లేక మరేదైనా కారణమా? అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News