Share News

ఢిల్లీ హత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెల్లడి..

ABN , Publish Date - Apr 23 , 2026 | 08:06 AM

దేశ రాజధాని ఢిల్లీలోని కైలాష్ హిల్స్‌లో యువతి హత్యాచారం కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలో అత్యాచారానికి ముందే మరో మహిళపై నిందితుడు రాహుల్ మీనా లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ఢిల్లీ హత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెల్లడి..
Delhi Kailash Hills Case

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కైలాష్ హిల్స్‌లో యువతి హత్యాచారం కేసులో.. పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ఢిల్లీలో హత్యాచారానికి ముందే.. మరో మహిళపై నిందితుడు రాహుల్ మీనా లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఓ మహిళపై అతను అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని బుధవారం రాత్రి అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోందని వెల్లడించారు.


ఢిల్లీ అత్యాచార ఘటనకు ముందు మంగళవారం రాత్రి అల్వార్‌లోని తన స్నేహితుడి ఇంటికి రాహుల్ వెళ్లాడని పోలీసులు తెలిపారు. స్నేహితుడు లేకపోవడంతో అతని భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పారు. అదే రోజు రాత్రి ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం అనంతరం నిందితుడు వెంటనే అల్వార్ నుంచి ఢిల్లీకి బయలుదేరాడని వెల్లడించారు. ప్రయాణ ఖర్చుల కోసం మొబైల్ ఫోన్‌ను రూ.10,000కు విక్రయించాడని, తనను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు రూ.6,000 చెల్లిస్తానని వ్యాన్ డ్రైవర్‌కు చెప్పినట్లు తెలిపారు. అయితే దేశ రాజధానికి చేరుకున్న తర్వాత డబ్బులు చెల్లించకుండానే అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


బుధవారం ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని కైలాష్ హిల్స్‌కు నిందితుడు రాహుల్ చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. అనంతరం 6:39 గంటలకు బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. సుమారు 40 నిమిషాల పాటు ఇంట్లోనే ఉన్నాడని, ఆ సమయంలో యువతిపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె గొంతు నులిమి హత్య చేశాడని.. నగదు, విలువైన వస్తువులు దోచుకుని పారిపోయినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఉదయం 7:15 గంటల సమయంలో ఇంటి నుంచి నిందితుడు బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయని తెలిపారు. బయటకు వెళ్లే ముందు రాహుల్ తన దుస్తులు మార్చుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


కాగా, నిందితుడు గతంలో సుమారు 10 నెలల పాటు ఆ ఇంట్లో పని చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించేవాడు కాదని, ఆ కారణంగానే అతన్ని పనిలో నుంచి తొలగించినట్లు చెప్పారు. ఆ కుటుంబంపై పగ పెంచుకున్న నిందితుడు వారి కుమార్తెపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తప్పించుకుని తిరుగుతున్న అతన్ని ఎట్టకేలకు బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిపై లైంగిక దాడికి పాల్పడి వారిలో ఒకరిని హత్య చేయడం సంచలనం సృష్టిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోలింగ్ షురూ..

ఓటేయడం మీ బాధ్యత, కర్తవ్యం: ప్రధాని మోదీ

Updated Date - Apr 23 , 2026 | 09:55 AM