సముద్రగర్భ కేబుళ్లను ధ్వంసం చేస్తాం
ABN , Publish Date - Apr 23 , 2026 | 06:15 AM
తన ఓడరేవులను అమెరికా దిగ్బంధించటంతో చమురు విక్రయం ఆగిపోయి ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్.. దిగ్బంధనాన్ని వెంటనే ఆపకపోతే పర్షియన్ గల్ఫ్‌లోని...
మా ఓడరేవుల దిగ్బంధనం ఆపకపోతే దాడి తప్పదు
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక
మా శత్రువుకు సాయం చేస్తే.. మీ చమురు క్షేత్రాలుండవ్
పొరుగు దేశాలకు అల్టిమేటం.. హోర్ముజ్‌లో ఉద్రిక్తత
బుధవారం నాలుగు వాణిజ్య నౌకలపై దాడులు
గుజరాత్‌కు రావాల్సిన చమురు ట్యాంకర్ నిర్బంధం
కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించిన ట్రంప్
ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగిస్తామని స్పష్టీకరణ
శుక్రవారం లోపు రెండో దఫా చర్చలుంటాయని ఆశాభావం
ఓడిపోబోయేవారు షరతులు విధించలేరు
తదుపరి చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ఇరాన్
వాషింగ్టన్/ టెహ్రాన్, ఏప్రిల్ 22: తన ఓడరేవులను అమెరికా దిగ్బంధించటంతో చమురు విక్రయం ఆగిపోయి ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్.. దిగ్బంధనాన్ని వెంటనే ఆపకపోతే పర్షియన్ గల్ఫ్‌లోని సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని బుధవారం హెచ్చరించింది. ఈ మేరకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్స్ప్ (ఐఆర్‌జీసీ) ఓ ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో గత ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన తర్వాత సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించటం ఇదే తొలిసారి. ఈ కేబుళ్లు ధ్వంసమైతే చాలాదేశాల్లో ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోతాయి. కాగా, తన శత్రువుకు సహాయం చేసే దేశాలపై భీకరమైన దాడులు చేస్తామని ఐఆర్‌జీసీ తేల్చి చెప్పింది. ‘ఇరాన్‌పై దాడులు చేసేందుకు మా పొరుగున ఉన్న దేశాలు శత్రువుకు తమ భూ భాగాలను వాడుకొనేందుకు అవకాశం ఇస్తే.. ఆయా దేశాలు వారి చమురు ఉత్పత్తిని శాశ్వతంగా వదిలేసుకోవాల్సి వస్తుంది’ అని ఐఆర్‌జీసీ వైమానిక దళం అధిపతి జనరల్ మాజిద్ మౌసవీ హెచ్చరించారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం నాలుగు వాణిజ్య నౌకలపై ఐఆర్‌జీసీ దాడులు చేసింది. లైబీరియా పతాకంతో గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వస్తున్న ఎపమినోడ్స్‌అనే ట్యాంకర్‌తోపాటు ఎంఎస్ సీ ఫ్రాన్సిస్కా అనే మరో నౌకను అదుపులోకి తీసుకొని ఇరాన్‌కు తరలించింది. ఈ చర్యను ఇరాన్ అధికారిక ఫార్స్ న్యూస్, టాస్మిన్ న్యూస్ సంస్థలుసమర్థించుకున్నాయి. ఆ నౌకలు ఇరాన్ బలగాల హెచ్చరికలను లెక్కచేయపోవటం వల్లే అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. జలసంధి గుండా వాణిజ్య నౌకలు వెళ్లాలంటే కచ్చితంగా తమ అనుమ తి తీసుకోవాలని ఇరాన్ నేవీ బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మరో రెండు నౌకలపై ఐఆర్‌జీసీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపిందని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సంస్థ వెల్లడించింది. కాగా, ఇరాన్ పోర్టులను అమెరికా నిర్బంధించటానికి ముందే ఆ దేశానికి చెం దిన 34 చమురు నౌకలు రూ.8,400 కోట్ల విలువైన చమురుతో హోర్ముజ్ నుంచి బయటకు వెళ్లిపోయాయని ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా సంస్థ పేర్కొంది.
కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నా: ట్రంప్
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ఈ నెల 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు బుధవారంతో ముగిసింది. అంతకుముందే పాకిస్థాన్‌లో రెండోదఫా చర్చల కోసం ట్రంప్ విశ్వప్రయత్నాలు చేశారు. తమ ప్రతినిధి బృందాన్ని పాక్‌కు పంపుతున్నట్లు ఆదివారం ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసేలోపు ఇరాన్ శాశ్వత శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే ఆ దేశంలోని ప్రతి విద్యుత్ ప్లాంటును, ప్రతి వంతెనను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అయినా ఇరాన్ స్పందించకపోవటంతో కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియటానికి కొద్దిసేపటి ముందు దానిని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం రెండుగా చీలిపోయిందని, వారు కలిసిపోయి చర్చలకు ముందుకొచ్చేందుకే ఈ అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధనాన్ని మాత్రం కొనసాగిస్తామని వెల్లడించారు. తమ నౌకాదళం ఇరాన్ రేవులను దిగ్బంధించటంతో ఆ దేశానికి రోజుకు దాదాపు రూ.4,600 కోట్లకుపైగా నష్టం వస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ ప్రభు త్వం తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటోందని.. సైనికులకు, పోలీసులకు జీతాలూ చెల్లించలేకపోతోందని చెప్పారు. హోర్ముజ్ జలసంధిని మూసేశామని పైకి చెప్తూ.. దానిని తెరవాలని ఇరాన్ నేతలు ప్రాధేయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇరాన్‌తో రెండో దఫా చర్చలు శుక్రవారం లోపు ప్రారంభం కావచ్చని సూచనప్రాయంగా తెలిపారు.
ఓడిపోబోయేవారు
షరతులు పెట్టలేరు: ఇరాన్
ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఎద్దేవా చేసింది. ‘కాల్పుల విరమణ పొడిగింపు అనేది ఆకస్మిక దాడు ల కోసం సమయం తీసుకొనే ఎత్తుగడ. ట్రంప్ నిర్ణయంలో అర్థమే లేదు. ఓడిపోబోయేవారు షరతుల ను పెట్టలేరు. మా రేవులను నిరవధికంగా దిగ్బంధించటం బాంబులు వేయటం కంటే తక్కువేం కాదు. అందుకు మా సైనిక ప్రతిస్పందన కచ్చితంగా ఉంటుంది. ఇక ఇరాన్ స్వయంగా చొరవ తీసుకొనే సమయం ఆసన్నమైంది’ అని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహ మ్మద్ బఘర్ ఘాలిబఫ్ సలహాదారు మహదీ మొహమ్మదీ బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. తమ పోర్టులపై అమెరికా దిగ్బంధనాన్ని తొలగించేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని ఇరాన్ ప్రభుత్వం లేఖ రాసింది. తమ పోర్టుల ను దిగ్బంఽధించటం కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన కిందికే వస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. ఇదిలా ఉండగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు మళ్లీ మొదలయ్యాయి. హెజ్బొల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై బుధవారం రాకెట్లు ప్రయోగించటంతో.. ఆ దేశం వైమానిక దాడులు చేసింది. కాగా, ఇరాన్ నుంచి ఇరాక్‌కు దాదాపు 500 మిలియన్ డాలర్లను తీసుకెళ్తున్న ఓ విమానాన్ని అమెరికా అడ్డుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు
సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు