Share News

ఢిల్లీ హైకోర్టు ఆన్ లైన్ విచారణలో అశ్లీల దృశ్యాల కలకలం.. నిలిచిపోయిన కోర్టు కార్యకలాపాలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 03:35 PM

ఢిల్లీ హైకోర్టు ఆన్‌లైన్ విచారణ సందర్భంలో ఒక వికృత ఘటన చోటుచేసుకుంది. విచారణలో పాల్గొన్న వారిలో ఒకరు స్క్రీన్‌పై పదేపదే అశ్లీల కంటెంట్, అభ్యంతరకరమైన ఆడియో ప్లే చేయడంతో కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.

ఢిల్లీ హైకోర్టు ఆన్ లైన్ విచారణలో అశ్లీల దృశ్యాల కలకలం.. నిలిచిపోయిన కోర్టు కార్యకలాపాలు
Obscene Video Disrupts Delhi High Court Virtual Hearing

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: నేటి కాలంలో సాంకేతికత ఎంత ఉపయోగపడుతుందో, అదే స్థాయిలో దుర్వినియోగం అవుతుందనేందుకు తాజా ఉదాహరణ ఢిల్లీ హైకోర్టులో చోటుచేసుకుంది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ముందు వీడియో కాన్ఫరెన్స్ (VC) ద్వారా విచారణ జరుగుతుండగా ఒక వికృత ఘటన వెలుగు చూసింది. వర్చువల్ విచారణ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒక ఆగంతకుడు అశ్లీల వీడియోను ప్లే చేయడంతో కోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది.

అసలేం జరిగింది?

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజాస్ కారియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ (బుధవారం) ఉదయం తన విచారణలను కొనసాగిస్తోంది. సప్లిమెంటరీ లిస్ట్‌లోని కేసులను పరిశీలిస్తున్న సమయంలో, వర్చువల్ మీటింగ్‌లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి ఒక్కసారిగా అశ్లీల కంటెంట్‌ స్క్రీన్ షేర్ చేశాడు.

సదరు వ్యక్తి 'Shitjeet Sighn' అనే పేరుతో లాగిన్ అయినట్లు గుర్తించారు. విచారణ సమయంలో స్క్రీన్ మీద అశ్లీల వీడియో ప్లే కావడంతో షాక్‌కు గురైన కోర్టు సిబ్బంది వెంటనే వర్చువల్ లింక్‌ను నిలిపివేశారు. కొంత సమయం తర్వాత విచారణను తిరిగి ప్రారంభించగా, అదే వ్యక్తి మళ్లీ ప్రవేశించి రెండోసారి, ఆపై మూడోసారి కూడా అశ్లీల దృశ్యాలను ప్రదర్శించాడు.


ఈ గందరగోళం మధ్య బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక స్వరం వినిపించింది. 'ఇది అమెరికా నుండి జరుగుతున్న హ్యాకింగ్. వెంటనే మీటింగ్‌ను ఆపేయండి. తిరిగి దీన్ని ఆన్ చేయకండి. మీరు హ్యాక్ చేయబడ్డారు.' అని ఆ వాయిస్ హెచ్చరించింది. దీంతో పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన చీఫ్ జస్టిస్.. వర్చువల్ ప్రొసీడింగ్స్‌ను పూర్తిగా నిలిపివేశారు.

న్యాయవ్యవస్థలో పారదర్శకత, సమయపాలన కోసం ప్రవేశపెట్టిన వర్చువల్ విచారణలపై ఇటువంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టుల విచారణల్లో ఇలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి, దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం. అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శించిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది.


ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 29 , 2026 | 04:31 PM