మమ్మల్ని ఆటపట్టిస్తున్నారా.. కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:52 PM
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పార్టీ నేతలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇప్పటివరకు సమాధానాలు దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పార్టీ నేతలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇప్పటివరకు సమాధానాలు దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై గడువు పొడిగించేది లేదని స్పష్టం చేస్తూ.. చివరిసారిగా మూడు వారాల సమయం ఇచ్చింది. ఈలోగా సమాధానాలు సమర్పించకపోతే తమ వాదనలు వినిపించే హక్కును కోల్పోతారని హెచ్చరించింది (Delhi High Court).
ఢిల్లీ మద్యం విధానం కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితర నిందితులను ట్రయల్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తున్న సమయంలో.. కేజ్రీవాల్, సిసోడియా తదితరులు ఆమె విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే న్యాయమూర్తి ఆ అభ్యర్థనలను తిరస్కరించారు. దీంతో కేజ్రీవాల్, సిసోడియా తదితరులు ఆమె ఎదుట వ్యక్తిగతంగా లేదా న్యాయవాదుల ద్వారా హాజరుకాబోమని లేఖలు రాశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మపై సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోల నేపథ్యంలో కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభమయ్యాయి (Criminal Contempt Case).
ఈ కోర్టు ధిక్కరణ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్, దుర్గేశ్ పాఠక్, వినయ్ మిశ్రా, దేవేష్ విశ్వకర్మ తదితరులు ఉన్నారు. ఈ రోజు (మంగళవారం) ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ అరుణ్ భరద్వాజ్‌లతో కూడిన ధర్మాసనం ఆప్ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించిన పత్రాలు అందలేదని నేతల తరఫు న్యాయవాదులు చెప్పారు. అయితే రిజిస్ట్రీ నుంచి అందిన నివేదిక ప్రకారం అవసరమైన పత్రాల పంపిణీ పూర్తయిందని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా న్యాయస్థానం.. 'మమ్మల్ని ఆటపట్టిస్తున్నారా? ఇకపై మీకు సమయం ఇవ్వబోం. ఇప్పుడే సమాధానాలు దాఖలు చేయండి. లేకపోతే ఆ హక్కును మూసివేస్తాం' అంటూ తీవ్రంగా హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..