Share News

భవనం కూలిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ABN , Publish Date - Sep 07 , 2026 | 06:40 PM

ఢిల్లీ సత్య నికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంపై MCD ఉన్నతాధికారుల స్థాయిలోనే విచారణ జరిపించాలని ఆదేశించింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగాయా? బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

భవనం కూలిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
Delhi HC Orders MCD Inquiry Into Satya Niketan Building Collapse

ఢిల్లీ, సెప్టెంబర్ 7: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో బహుళ అంతస్తుల పీజీ భవనం కూలిపోయిన దుర్ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఉన్నతాధికారుల స్థాయిలోనే విచారణ జరిపించాలని ఆదేశించింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగాయా? బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

అంతేకాకుండా, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాలు, ప్రైవేట్ హాస్టళ్లపై వారం రోజుల్లోగా సమగ్ర 'ఆడిట్' (Audit) నిర్వహించాలని ఎంసీడీని ఆదేశించింది.


ఎంసీడీ పరిధిలోని అన్ని పీజీ హాస్టళ్లు నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా, భవన నిర్మాణ బైలాస్ (Building Bye-laws) పాటించారా అనే అంశంపై వారంలోగా తనిఖీలు పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రతి పీజీలో ఎంతమంది విద్యార్థులు నివసిస్తున్నారో లెక్క తేల్చాలని పేర్కొంది.

అధికారుల నిర్లక్ష్యమే కారణం: కేవలం భవన యజమానులపైనే బాధ్యత నెట్టేసి అధికారులు చేతులు దులుపుకోలేరని, భద్రతా ప్రమాణాలను అమలు చేయాల్సిన బాధ్యత ఎంసీడీ అధికారులపై కూడా ఉందని కోర్టు మందలించింది. అధికారులు సరిగ్గా పనిచేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడింది.

అనుమతుల్లేని అదనపు నిర్మాణాలు: కేవలం రెండు అంతస్తులకు అనుమతి తీసుకుని, పాత పునాదులపైనే నిబంధనలకు విరుద్ధంగా మరిన్ని అంతస్తులు నిర్మించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై కఠినమైన నియంత్రణ వ్యవస్థ (Regulatory Framework) ఉండాలని స్పష్టం చేసింది.

ఢిల్లీ యూనివర్సిటీకి నోటీసులు: విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు? వారి కోసం ఎన్ని హాస్టల్ వసతులు అందుబాటులో ఉన్నాయో చెప్పాలని ఢిల్లీ యూనివర్సిటీ (DU) ని ఆదేశించింది. సరైన హాస్టల్ సౌకర్యం లేకపోవడం వల్లే విద్యార్థులు ఇటువంటి ప్రైవేట్ పీజీలను ఆశ్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

కోర్టులో కేంద్రం హామీ

ఈ ఘటనపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామని, ఎలాంటి అలసత్వానికి తావివ్వబోమని కోర్టుకు విన్నవించారు. నివేదికలు, అఫిడవిట్లను 10 రోజుల్లోగా సమర్పించాలని అధికారులను ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి...

LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే చేస్తారా: మంత్రి సీతక్క

రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత

Updated Date - Sep 07 , 2026 | 06:40 PM