Share News

ఢిల్లీ అల్లర్ల కేసు.. ఉమర్ ఖలీద్‌కు తాత్కాలిక బెయిలు నిరాకరణ

ABN , Publish Date - May 19 , 2026 | 07:59 PM

జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత, 2020 ఢిల్లీ అల్లర్లతో ముడిపడిన కుట్ర కేసులో నిందితుడు ఉమర్ ఖలీద్‌కు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు నిరాకరించింది.

ఢిల్లీ అల్లర్ల కేసు.. ఉమర్ ఖలీద్‌కు తాత్కాలిక బెయిలు నిరాకరణ
Umar Khalid

న్యూఢిల్లీ: జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత, 2020 ఢిల్లీ అల్లర్లతో ముడిపడిన కుట్ర కేసులో నిందితుడు ఉమర్ ఖలీద్‌ (Umar Khalid)కు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు నిరాకరించింది. తన మేనమామ మరణాంతర సంస్కారాల్లో పాల్గొనేందుకు, జూన్ 2న తన తల్లికి సర్జరీ ఉన్నందున ఆమెను కనిపెట్టుకుని ఉండేందుకు 15 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఖలీద్ కోరారు. అయితే ఆయన అభ్యర్థనను అడిషనల్ సెషన్స్ జడ్జి తోసిపుచ్చారు.


ప్రతిసారి బెయిల్ ఇవ్వలేం..

ఈ కేసులో ఖలీద్, మరికొందరు నిందితులకు గతంలో తాత్కాలిక బెయిల్ ఇచ్చామని, ఎలాంటి షరతుల ఉల్లంఘన జరగలేదని, అంతమాత్రాన ప్రతి సందర్భంలోనూ బెయిల్‌కు అనుమతించాలనే నియమం ఏదీ లేదని కోర్టు పేర్కొంది. బెయిల్ అభ్యర్థనలను ఎప్పటికప్పుడు వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగానే పరిశీలించడం జరుగుతుందని తెలిపింది. మరణాంతర కర్మకాండల్లో పాల్గొనేందుకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయలేమని, మేనమామతో అంతగా అనుబంధం ఉండే ఇంత లేటుగా కాకుండా ఆయన మరణించినప్పుడే బెయిలు అడిగి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఖలీద్ తల్లి సర్జరీ విషయాన్ని ప్రస్తావిస్తూ, సర్జరీకి ముందు, ఆ తర్వాత ఆమెను చూసుకునేందుకు ఖలీద్ సోదరీమణులు, తండ్రి ఉన్నారని తెలిపింది.


2020 ఢిల్లీ అల్లర్ల కేసు

పౌరసత్వ సవరణ చట్టం (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)కు వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఖలీద్, షర్జీల్ ఇమామ్‌ సహా పలువురిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసులు నమోదయ్యాయి. ఈ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇందులో నిందితులకు ప్రమేయం ఉందని పోలీసుల ఆరోపణగా ఉంది. అయితే ఈ ఆరోపణలను నిందితులు తోసిపుచ్చారు. ఈ కేసులో నిందితులు 2020 నుంచి జైలులోనే ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ఖలీద్‌కు బెయిల్‌ నిరాకరణ సరికాదు

ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..

Updated Date - May 19 , 2026 | 08:43 PM