Share News

ఖలీద్‌కు బెయిల్‌ నిరాకరణ సరికాదు

ABN , Publish Date - May 19 , 2026 | 04:15 AM

జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ జైలు నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బెయిల్‌ అనేది తప్పనిసరి- జైలు అనేది మినహాయింపు’ అనే సూత్రం....

ఖలీద్‌కు బెయిల్‌ నిరాకరణ సరికాదు

  • సుప్రీంకోర్టు గత తీర్పుపై బెంచ్‌ అసంతృప్తి

  • ‘బెయిల్‌ తప్పనిసరి-జైలు మినహాయింపు’ అనే సూత్రం ఉ.పా. కేసు నిందితులకు సైతం వర్తిస్తుంది

  • విచారణలో తీవ్ర జాప్యం, సుదీర్ఘ నిర్బంధం అమలైన కేసుల్లో కోర్టులు బెయిల్‌ ఇవ్వొచ్చు

  • ఉ.పా.కేసుల్లో 2 నుంచి 6 శాతం మందికే శిక్షలు!

  • జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ భుయాన్‌ల ధర్మాసనం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 18: జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ జైలు నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బెయిల్‌ అనేది తప్పనిసరి- జైలు అనేది మినహాయింపు’ అనే సూత్రం ఉ.పా. (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) చట్టం కింద నిర్బంధించిన వారికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉమర్‌ ఖలీద్‌కు బెయిల్‌ను గతంలో సుప్రీంకోర్టు నిరాకరించడం పట్ల జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టు అయిన ఉమర్‌, అప్పటినుంచీ తిహాడ్‌ జైలులోనే ఉన్నారు. బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏప్రిల్‌లో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. మరో ఉ.పా. కేసులో నిందితుడు సయ్యద్‌ ఇఫ్తీకర్‌ అంద్రాబీకి బెయిల్‌ను మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పులో బెంచ్‌, ఉమర్‌ ఖలీద్‌ కేసు విషయం కూడా ప్రస్తావించింది. ఉ.పా.చట్టంలోని 43డీ(5) ప్రకారం ఉగ్రవాద సంబంధ కేసుల్లో నిందితులకు బెయిల్‌ మంజూరులో కఠినమైన ఆంక్షలను విధించినప్పటికీ, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ద్వారా వ్యక్తి స్వేచ్ఛకు లభించిన హామీని మాత్రం కోర్టులు నిరాకరించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉ.పా. కేసుల్లో బెయిల్‌ పిటిషన్లను కోర్టులు యాంత్రికంగా తిరస్కరించాల్సిన అవసరం లేదని సూచించింది. విచారణలో తీవ్ర జాప్యం, విచారణకు ముందే దీర్ఘకాలంపాటు జైలు నిర్బంధంలో ఉంచడం ద్వారా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన సందర్భంలో ఉ.పా. కేసుల్లో సైతం బెయిల్‌ మంజూరు చేయవచ్చునని 2021లో కేంద్ర ప్రభుత్వం వర్సెస్‌ కేఏ నజీబ్‌ కేసులో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన చారిత్రక తీర్పును బెంచ్‌ ప్రస్తావించింది.


ఈ తీర్పు స్ఫూర్తిని అమలుచేయడం, లేదా కేసులో సందేహం ఉంటే విస్తృత ధర్మాసనానికి కేసును బదలాయించడం ఉత్తమ న్యాయ విధానం అవుతుందని జస్టిస్‌ భుయాన్‌ అన్నారు. దానికి భిన్నంగా ద్విసభ్య ధర్మాసనం ఇలాంటి తీర్పు ఎలా ఇస్తుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమర్‌ ఖలీద్‌, గుర్వీందర్‌ సింగ్‌ వంటి ఉ.పా. కేసుల నిందితుల విషయంలో అనుసరిస్తున్న విధానం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించారు. కేసులో పస లేదని నిందితుడు స్వయంగా నిరూపించుకుంటేనే బెయిల్‌ ఇస్తామని గుర్వీందర్‌ సింగ్‌ కేసులో షరతు పెట్టడాన్ని బెంచ్‌ ఆక్షేపించింది.

ఉ.పా.కేసుల్లో శిక్షలశాతం ఇంత తక్కువా? : బెంచ్‌

ఉ.పా. కేసుల్లో శిక్షల శాతం అత్యల్పంగా ఉండటం పట్ల జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ భుయాన్‌ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 90ు కేసుల్లో ఉ.పా. నిందితులు నిర్దోషులుగా విడుదల అవుతున్నట్టు బెంచ్‌ పేర్కొంది. ఉ.పా. కేసులో నిందితుడు సయ్యద్‌ ఇఫ్తీకర్‌కు బెయిల్‌ ఇస్తూ జారీచేసిన ఆదేశాల్లో బెంచ్‌ ఈ మేరకు స్పందించింది. ఉ.పా.కేసుల్లో 2-6శాతం మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయని తెలిపింది. దీన్నిబట్టి ఉ.పా.నిందితులు నిర్దోషులుగా బయటపడేందుకు 94-98 శాతం అవకాశం ఉన్నట్టే కదా అని బెంచ్‌ వ్యాఖ్యానించింది.

Updated Date - May 19 , 2026 | 04:15 AM