Share News

ఢిల్లీలో దారుణం.. భవనంపై నుంచి గ్యాస్ సిలిండర్ విసిరి యువకుడి హత్య

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:19 AM

చిన్నపాటి గొడవ చివరకు యువకుడి ప్రాణాలను బలిగొంది. నిందితుడు భవనంపై నుంచి గ్యాస్ సిలిండర్ విసరడంతో తలకు తీవ్ర గాయాలై యువకుడు మృతి చెందాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని బిందాపుర్‌లో చోటుచేసుకుంది.

ఢిల్లీలో దారుణం.. భవనంపై నుంచి గ్యాస్ సిలిండర్ విసిరి యువకుడి హత్య
Delhi Case

ఇంటర్నెట్ డెస్క్: చిన్నపాటి వివాదం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. పక్కింటి వారితో జరిగిన గొడవలో సహనం కోల్పోయిన నిందితుడు భవనంపై నుంచి గ్యాస్ సిలిండర్‌ను కిందకు విసరడంతో 28 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నైరుతి ఢిల్లీలోని బిందాపుర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

సాహిల్ అనే యువకుడికి, అతని పొరుగింటి వారి మధ్య జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో.. నిందితుడు భవనం పైనుంచి గ్యాస్ సిలిండర్‌ను విసిరాడు. అది నేరుగా సాహిల్ తలకు బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతని స్నేహితులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ (DDU) ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.


సాహిల్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన సోదరుడి నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆఫీస్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లినట్లు సాహిల్ మామ తెలిపారు. తన మేనల్లుడిపై గ్యాస్ సిలిండర్ విసరడంతోనే ఈ దారుణం జరిగిందని.. సిలిండర్ నేరుగా తలకు తగలడంతో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని, తమ కుటుంబానికి న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

భారతీయుడి ప్రపంచ రికార్డు.. 10 లక్షల మంది యూట్యూబ్ పెయిడ్ ఛానల్ మెంబర్స్..

ప్రశ్నలు మీవే.. సమాధానాలూ మీవే.. ఐఐటీలో ఇలాంటి పరీక్షలా?

Updated Date - Nov 28 , 2026 | 12:42 PM