Share News

డాక్టర్లకు క్షమాపణలు చెప్పిన జొమాటో వ్యవస్థాపకుడు.. అసలు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 06 , 2026 | 08:46 PM

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన కొత్త ఆరోగ్య పర్యవేక్షణ పరికరం 'టెంపుల్'పై విమర్శలు చేస్తున్న వైద్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో క్షమాపణలు చెప్పారు.

డాక్టర్లకు క్షమాపణలు చెప్పిన జొమాటో వ్యవస్థాపకుడు.. అసలు ఏం జరిగిందంటే..
Deepinder Goyal Apology

ఇంటర్నెట్ డెస్క్: జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన కొత్త ఆరోగ్య పర్యవేక్షణ పరికరం 'టెంపుల్'పై విమర్శలు చేస్తున్న వైద్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో క్షమాపణలు చెప్పారు. దేశంలోని వైద్యులందరినీ ఒకే గాటన కట్టడం తన తప్పేనని అంగీకరించారు. తన విమర్శలు మొత్తం వైద్య సమాజంపై కాదని స్పష్టం చేశారు. తాజాగా ఎక్స్ వేదికగా ఆయన ఈ వివరణ ఇచ్చారు (Deepinder Goyal Apology).


దీపిందర్ గోయల్ ఇటీవల 'టెంపుల్' పేరుతో ఓ హెల్త్ ట్రాకింగ్ పరికరాన్ని పరిచయం చేశారు. నుదిటిపై అమర్చుకునే ఈ పరికరం లైట్ సెన్సర్ల సాయంతో మెదడులో రక్తప్రసరణ, ఆక్సిజన్ స్థాయులు, శరీరంపై పడుతున్న శారీరక ఒత్తిడికి సంబంధించిన సంకేతాలను పర్యవేక్షించగలదని సంస్థ చెబుతోంది. అయితే ఈ పరికరం నిజంగా మెదడులో రక్తప్రసరణను కొలవగలదా? దాని ద్వారా వచ్చే వివరాలకు తగిన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? అంటూ పలువురు వైద్య నిపుణులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పరికరం ధరను రూ.85,000గా నిర్ణయించడంపై విమర్శలు చేశారు (Deepinder Goyal Temple).


వైద్యుల విమర్శలపై నవంబర్ 5న దీపిందర్ గోయల్ ఎక్స్‌లో ఏడు అంశాలతో సుదీర్ఘ పోస్టు పెట్టారు. టెంపుల్ ఒక మోసపూరిత ఉత్పత్తి అయితే దాన్ని ఉపయోగించిన కొద్ది రోజుల్లోనే ప్రజలకు విషయం అర్థమవుతుందని అన్నారు. ఎటర్నల్ సీఈఓ పదవిని వదిలి టెంపుల్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం డబ్బు కోసం కాదని, ఒక లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టానని చెప్పారు. తన వివరణతో విమర్శకులు సంతృప్తి చెందకపోతే ఇంకా కోపంతో విమర్శిస్తూనే ఉండొచ్చన్నారు. అలాగే తామే ఎంతో ఉన్నతులమని భావించే భారతీయ వైద్యులు తన పోస్టును పట్టించుకోనవసరం లేదని వ్యాఖ్యానించారు (emple Device Controversy).


ఈ వ్యాఖ్యలపై వైద్య వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. టెంపుల్ పరికరంపై శాస్త్రీయ ప్రశ్నలు అడిగిన వారిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తన వ్యాఖ్యలపై విమర్శలు పెరగడంతో తాజాగా దీపిందర్ గోయల్ మరోసారి ఎక్స్‌లో స్పందించారు. భారతీయ వైద్యులందరినీ ఒకే గాటన కట్టడం తన తప్పేనని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. తాము ఎంతోమంది భారతీయ వైద్యులతో కలిసి పనిచేస్తున్నామని, తన అన్నయ్య కూడా వైద్యుడేనని గుర్తుచేశారు. కొందరు డాక్టర్లు తమ వృత్తిని పక్కన పెట్టి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారిపోయారని, వారినే తాను విమర్శించానని దీపిందర్ వివరణ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

కొనసాగుతున్న లాభాలు.. 1,200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..


ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..

Updated Date - Nov 06 , 2026 | 08:47 PM