Share News

బీజేపీ నేతకు దక్కని ఎమ్మెల్యే టికెట్.. దాటియాలో చెలరేగిన అలర్లు..

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:55 PM

మధ్యప్రదేశ్‌లోని దాటియా అసెంబ్లీ పరిధిలో అల్లర్లు చెలరేగాయి. దాటియా ఉపఎన్నికకు తమ పార్టీ అభ్యర్థిగా అశుతోష్ తివారిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించడంతో వివాదం మొదలైంది.

బీజేపీ నేతకు దక్కని ఎమ్మెల్యే టికెట్.. దాటియాలో చెలరేగిన అలర్లు..
Datia BJP Ticket Row

దాటియా: మధ్యప్రదేశ్‌లోని దాటియా అసెంబ్లీ పరిధిలో అల్లర్లు చెలరేగాయి. దాటియా ఉపఎన్నికకు తమ పార్టీ అభ్యర్థిగా అశుతోష్ తివారిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించడంతో వివాదం మొదలైంది. మాజీ హోంమంత్రి నరోత్తం మిశ్రాకు టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు శుక్ర, శనివారాల్లో భారీఎత్తున ఆందోళనకు దిగారు. సుమారు 3 వేల మందికి పైగా కార్యకర్తలు జాతీయ రహదారి (ఎన్‌హెచ్-44)పై బైఠాయించారు. దాదాపు 12 గంటల పాటు రహదారిని దిగ్బంధించి నిరసన చేపట్టారు.


పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఈరోజు(శనివారం) ఎస్పీ సహా పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే, పోలీసులపై నిరసనకారులు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు సహా పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అలాగే, పోలీసు వాహనాలతో పాటు ఇతర వాహనాలనూ ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.


2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దాటియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అప్పటి రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా పోటీ చేశారు. కాంగ్రెస్ తరఫున రాజేంద్ర భారతి బరిలో దిగారు. రాజేంద్ర భారతి చేతిలో 7,500కు పైగా ఓట్ల తేడాతో మిశ్రా ఓటమి పాలయ్యారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ కేసులో రాజేంద్ర భారతికి ఢిల్లీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యారు. ఈ మేరకు దాటియా స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.


ఈ నేపథ్యంలో ఉపఎన్నికలో తనకే మరోసారి అవకాశం వస్తుందని నరోత్తం మిశ్రా భావించారు. ఇప్పటికే నామినేషన్ పత్రం కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే, బీజేపీ అధిష్ఠానం మాత్రం అనూహ్యంగా శుక్రవారం నాడు అశుతోష్ తివారిని అభ్యర్థిగా ప్రకటించింది. అధిష్ఠానం నిర్ణయం మిశ్రా అనుచరులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో ఆయన మద్దతుదారులు, వేలాది మంది కార్యకర్తలు ఎన్‌హెచ్-44పై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆందోళన విరమించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


కాగా, ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం దాటియాతో పాటు బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లోని మరో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దాటియా అసెంబ్లీ స్థానానికి జులై 30న పోలింగ్, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థి ఎంపిక చుట్టూ నెలకొన్న వివాదం ఉపఎన్నిక ప్రచారాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.


ఈ వార్తలు కూడా చదవండి

పెదవి గాయానికి చికిత్స.. మత్తుమందు ఇచ్చిన వెంటనే చిన్నారి మృతి..

18 నౌకల్లో రూ.9వేల కోట్ల సరకును సురక్షితంగా భారత్‌కు చేర్చాం: రాజ్‌నాథ్ సింగ్

Updated Date - Jul 11 , 2026 | 05:02 PM