నేతలపై నేరాల మరకలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 04:50 AM
చట్టసభల్లో మహిళల రక్షణపై గళమెత్తాల్సిన ప్రజాప్రతినిధులపైనే తీవ్రమైన నేరారోపణలు నమోదయ్యాయి.
మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో ప్రజాప్రతినిధులు
దేశవ్యాప్తంగా 187 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు
14 మందిపై ఏకంగా అత్యాచార ఆరోపణలు
జాబితాలో తెలంగాణ ఎంపీ!
రాష్ట్రంలో ఐదుగురు, ఏపీలో 22 మందిపై అభియోగాలు
ఐదుగురు కేంద్ర మంత్రులపైనా కేసులు: ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో మహిళల రక్షణపై గళమెత్తాల్సిన ప్రజాప్రతినిధులపైనే తీవ్రమైన నేరారోపణలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఏకంగా 187 మంది ప్రజాప్రతినిధులపై మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులకు సంబంధించిన కేసులు ఉన్నట్లు అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. మొత్తం 4,881 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యాచారం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, వేధింపులు వంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల వివరాలతో ఏడీఆర్ శుక్రవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఈ జాబితాలో 19 మంది ఎంపీలు, 168 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 14 మంది ప్రజాప్రతినిధులపై (12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు లోక్‌సభ ఎంపీలు) నేరుగా అత్యాచారం కేసులు ఉండటం గమనార్హం. ఐదుగురు కేంద్ర మంత్రులపై కూడా మహిళలపై నేరాలకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రాల వారీగా చూస్తే, మహిళలపై నేరాల కేసులున్న ప్రజాప్రతినిధుల జాబితాలో పశ్చిమ బెంగాల్ 69 మందితో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 22మందితో (21 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ) రెండో స్థానంలో నిలిచింది. ఒడిశా 17 మంది ప్రజాప్రతినిధులతో మూడో స్థానంలో ఉంది. తెలంగాణలో మొత్తం ఐదుగురిపై (ముగ్గురు లోక్‌సభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు) కేసులు ఉన్నాయి. పార్టీల వారీగా చూస్తే బీజేపీ 106 మంది(95 ఎమ్మెల్యేలు, 11 మంది ఎంపీలు)తో అగ్రస్థానంలో నిలవగా, 20 మంది(19 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ)తో కాంగ్రెస్ రెండో స్థానంలో, 18 మంది(17 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ)తో టీడీపీ మూడో స్థానంలో నిలిచింది. కాగా, బీజేపీకి చెందిన 11 మంది ఎంపీలలో ఐదుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరిలో ఒక మంత్రి తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కావడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో కేసుల వివరాలు..
తెలంగాణ నుంచి బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలపై కేసులు నమోదు కాగా, అందులో తొలిసారి గెలిచిన సిట్టింగ్ ఎంపీపై అత్యాచారం కేసు ఉంది. ఇక ఏపీలో కూటమికి చెందిన నలుగురు మంత్రులపై కూడా కేసులు నమోదవగా.. ఒక వివాదస్పద ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు ఉంది. ఇటీవల కూటమి నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఒక యువ ఎంపీతో పాటు రాష్ట్రంలో రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక సీనియర్ నేతపై కూడా అభియోగాలు ఉండటం గమనార్హం. నేర చరిత్ర, ప్రత్యేకించి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడాన్ని ఏడీఆర్ తీవ్రంగా ఆక్షేపించింది. వారిని ఎన్నికల్లో పోటీకి శాశ్వతంగా అనర్హులుగా ప్రకటించాలని, క్రిమినల్ నేపథ్యం ఉన్న ప్రజాప్రతినిధుల కేసులను వేగవంతం చేసి సత్వరమే విచారించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్!
మెటా కళ్లద్దాలతో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం: కర్ణాటక సీఎం